విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాల్సిందే

3 Apr, 2016 23:49 IST|Sakshi
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయాల్సిందే

యలమంచిలి: విభజన కారణంగా అన్యాయం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. యలమంచిలి జిల్లా పరిషత్ విశ్రాంతి గృహంలో ఆదివారం విలేకరులతో  మాట్లాడారు. చట్టాలను ఉల్లంఘించడమే పనిగా రాష్ట్రంలో అధికారపార్టీ అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటులో ఎడతెగని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వేజోన్ సాధించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయాలకతీతంగా పోరాడుతుందన్నారు. అంబేద్కర్ జయంతిలోగా కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో విశాఖజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారన్నారు. విశాఖ, అనకాపల్లి ఎంపీలు రైల్వేజోన్ కోసం కృషి చేయడం లేదన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా ప్రకటనలు, కేటాయింపులకే పరిమితమైన వివిధ శాఖల నిధులు వెనక్కి మళ్లిన వైనాన్ని గణాంకాలతో వివరించారు. జన్మభూమి కమిటీలు దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ఉచిత ఇసుకపై నిర్ధిష్ట విధానం లేదని.. గత ప్రభుత్వ హయాంలో క్యుబిక్‌మీటర్ ఇసుక రూ.60 ఉంటే, దానిని రూ.500కు పెంచి రెండేళ్లపాటు టీడీపీ నేతలు దోపిడీ చేశారని అన్నారు.

విభజన చట్టంలో పెట్టిన అంశాలను నెరవేర్చాల్సిన చంద్రబాబు ప్రకటనలకే పరిమితమవుతున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో గుడివాడ అమర్‌నాథ్, ప్రగడ నాగేశ్వరరావు, కొయ్య ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, బొద్దపు ఎర్రయ్యదొర, పలివెల అమృతవల్లి, బెజవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు