విశాఖ  రైల్వే  జోన్‌ లాభదాయకమే!

15 Sep, 2019 04:24 IST|Sakshi
విశాఖ రైల్వే స్టేషన్‌

జోన్‌ ఏర్పాటైతే ఏటా రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం

రూ.250 కోట్లు వెచ్చిస్తే చాలు 

రైల్వే బోర్డుకు నివేదించిన దక్షిణ కోస్తా జోన్‌ ఓఎస్‌డీ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్ట్‌) రైల్వే జోన్‌ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రైల్వే బోర్డుకు చేరింది. వాల్తేరు డివిజన్‌లోని ఏ ఒక్క ఉద్యోగినీ కదల్చనవసరం లేకుండా.. ఏడాదికి రూ.13 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చేలా ఓఎస్‌డీ ధనుంజయులు డీపీఆర్‌ను రూపొందించి రైల్వే బోర్డుకు అందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆ నివేదిక ప్రతులను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఉన్నతాధికారులకు, వివిధ విభాగాలకు అందించింది. వారి నుంచి రెండు వారాల్లో అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనుంది. వీటన్నింటినీ క్రోడీకరించి తుది నివేదిక సిద్ధం చేస్తారు. అనంతరం కేంద్ర కేబినెట్‌లో ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత జోన్‌ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించాలని నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని వాల్తేరు రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతా సక్రమంగా సాగితే.. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ జోన్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. 

డీపీఆర్‌లో ముఖ్యాంశాలివీ
- జోన్‌ కేంద్రంతో పాటు వాల్తేరు డివిజన్‌ను విభజించి, కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌ను రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. దీంతోపాటు ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వ్యయంతో అదనపు హంగులు సమకూర్చాలి 
జోన్‌ ప్రధాన కార్యాలయానికి రూ.100 కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది 
జోన్‌ ఏర్పడితే రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది 
వాల్తేరు డివిజన్‌ను విభజించి.. రాయగడ డివిజన్‌ ఏర్పాటు చేసి.. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్‌లో విలీనం చేయాల్సి ఉంటుంది 
వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయాల్ని జోన్‌ తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా చేయాలి. ఏడాదిలోపు పూర్తి సదుపాయాలతో జోన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నిర్మించవచ్చు. 
రాష్ట్రాల సరిహద్దుల్ని పరిగణనలోకి తీసుకోకుండా జోన్‌ హద్దుల నిర్ణయం 
విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్‌తో కలిపి సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌లో 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు 
వాల్తేరు డివిజన్‌లో 18 వేల మంది ఉద్యోగులుండగా.. వీరిలో 930 మంది డీఆర్‌ఎం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్‌ వస్తే.. జోన్‌ కార్యాలయంలో 1,250 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. అదనంగా ఉద్యోగులు అవసరం కాగా.. కేవలం 930 మందికి ఆప్షన్లు ఇస్తే సరిపోతుంది. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది విశాఖ కేంద్రంగా ఉన్న జోన్‌లోనే పనిచేస్తారు 
వాల్తేరు నుంచి కొత్త డివిజన్‌కు వెళ్తే.. ఉద్యోగులు కొత్త జోన్‌ పరిధిలోకే వస్తారు. వారి సీనియారిటీలో ఏ మాత్రం మార్పు లేకుండా ప్రమోషన్లు పొందేలా విధివిధానాలు 
వాల్తేరు డివిజనల్‌ రైల్వే ఆస్పత్రిని ఆధునికీకరించి అత్యాధునిక వైద్య సదుపాయాలతో అప్‌గ్రేడ్‌ చేయాలి 
రాయగడ డివిజన్‌ ఏర్పాటు అంశాన్ని కూడా డీపీఆర్‌లో ప్రధానంగా పొందుపరిచారు 
డివిజన్‌లోని డీజిల్, ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌లు, మెకానికల్‌ వర్క్‌ షాపులు, కోచ్‌ మెయింటెనెన్స్‌లను అప్‌గ్రేడ్‌ చేయాలి 
జోన్‌ తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిధిలో 5 రైళ్లు, ఇతర ప్రాంతాలకు మరో 5 కలిపి మొత్తం 10 సర్వీసులు ప్రారంభించాలని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు