విశాఖకు ఉప్పుద్రవం!

21 Jun, 2019 10:41 IST|Sakshi

వర్షాభావం వల్ల వట్టిపోతున్న భూగర్భం

ఆ స్థానంలోకి చొచ్చుకొస్తున్న సాగరజలాలు

ఫలితంగా ఉప్పునీటితో నిండిపోతున్న భూగర్భం

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి

నగరానికి ప్రకృతి అమర్చిన నగలా భాసిల్లుతోంది అతి పొడవైన సాగరతీరం. విశాఖ ఎదుగుదలకు పారిశ్రామికంగా, పర్యాటకంగా దోహదం చేస్తోంది. కానీ ఇదే సాగర తీరం భవిష్యత్తులో నగరానికి పెను ఉపద్రవంగా పరిణమించనుందా?.. ఈ ప్రశ్నకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.అదేమిటీ.. సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న విశాఖ సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా సురక్షితంగా ఉంటుందని కదా ఇప్పటి వరకు ధైర్యంగా ఉంటున్నాం.. అని అంటారా!..అది కరెక్టే గానీ.. భవిష్యత్తులో కమ్ముకొచ్చే ముప్పు మరో రూపంలో ఉంటుందన్నది నిపుణుల హెచ్చరిక.. సాగర జలాలు చాపకింద నీరులా నగర పరిధిలోని భూగర్భంలోకి చొచ్చుకొచ్చి పాతాళగంగను ఉప్పుతో నింపేస్తున్నాయి.

దీని వల్ల మరికొన్నేళ్లలో నగరం తీవ్రమైన తాగునీటి ఎద్దడితో తల్లడిల్లిపోనుందని అంటున్నారు. అదెలా అంటే.. భూగర్భ జలమట్టాలు పుష్కలంగా ఉంటే నగరానికి ఆనుకొని ఉన్న సాగర జలాలను రాకుండా అడ్డుకుంటాయి. కానీ గత కొన్నేళ్లుగా అరకొర వర్షాలు, నగర పరిధిలోని భూమిలో సుద్ద మట్టి వల్ల నీరు భూమిలోకి ఇంకకపోవడం వంటి పరిస్థితులతో భూగర్భం వట్టిపోతోంది. ఆ ఖాళీ స్థలాల్లోకి సాగరజలాలు చొచ్చుకొస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాల్లో ఉప్పు నీరు కలిసిపోతోంది. మొత్తం భూగర్భ నీటివనరులను ఉప్పుమయం చేసేస్తోంది. ఇప్పటికే సాగరతీరాన్ని ఆనుకొని ఉన్న పలు ప్రాం తాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భాన్ని రీచార్జ్‌ చేసే చర్యలను ముమ్మరం చేయకపోతే భవిష్యత్తులో నగరం మొత్తం ఉప్పునీటి కయ్యగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

► ఉప్పునీటి కయ్యగా విశాఖ నగరం
► అక్షరాలా మనిషి స్వయంకృతం
► ఆందోళన కలిగిస్తున్న పరిణామం
► రాబోయే కాలంలో నీరు పూర్తిగా నిరుపయోగం
► ఇంకుడుగుంతలే పరిష్కారం

ముప్పులు ఎన్నో విధాలు.. వాటిలో ఉప్పు ముప్పు విశాఖను భయపెడుతోంది. చాపకింద నీరన్నది అక్షరాలా విశాఖను ఉప‘ద్రవం’లా కలవరపెడుతోంది. దీనిని ఉప్పుద్రవం అనాలేమో. ఎందుకంటే నగరంలో భూగర్భ జలాల పరిమాణం తగ్గిపోతూ ఉంటే.. ఆ స్థానాన్ని సముద్రం నుంచి లవణ జలాలు ఆక్రమిస్తూ ఉండడంతో నగరం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం వెంటాడుతోంది. 

సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖనగరం.. నవ్యాంధ్రకు ఆర్థిక రాజధాని...ఉత్తరాంధ్ర ముఖద్వారం....23 లక్షలకు పైగా జనాభా కలిగి.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ప్రతిరోజు నాలుగైదులక్షల ఫ్లోటింగ్‌ జనాభాతో నిత్యం కిటికట లాడే పారిశ్రామిక రాజధాని.. ఉక్కునగరంగా... సాగరనగరంగా.. స్మార్ట్‌ సిటీగా ఎన్నో విశిష్టతలు కల్గిన ఈ మహానగరానికి పెనుముప్పు పొంచి ఉంది.భవిష్యత్తులో విశాఖ నగరాన్నే ఖాళీ చేయాల్సిన పరిస్థితులు దాపురించబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విశాఖ నగరం..బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న సాగరనగరం.ఇప్పుడు ఆ సాగరమే విశాఖకు శాపంగా మారనుంది. ఈ నగరానికి ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ స్థాయిలో నీటి ఇక్కట్లు ఎదురవలేదు. కారణం ఈ నగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడమే. సాధారణంగా సాగరం పక్కనే ఉండే నగరాలు, ప్రాంతాల్లోని ఉప్పునీటి శాతం ఎక్కువగా ఉండడం వలన ఆ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు వాడేందుకు ఏమాత్రం ఉపయోగపడవు. కానీ విశాఖనగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడం.. సముద్ర నీరు నగర భూగర్భపొరల్లోకి చొచ్చుకొచ్చేపరిస్థితులు లేకపోవడం వలన ఇన్నాళ్లు గ్రౌండ్‌ వాటర్‌ కోసం పెద్దగా ఇబ్బందిపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. వేసవిలో 15–20 రోజులు కాస్త  భూగర్భ జలాలు అడుగంటినా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ సమీప భవిష్యత్తులో విశాఖ నగరం మహాముప్పును ఎదుర్కోబో తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంజరు భూముల్లా రిజర్వాయర్లు
నగర దాహాన్ని తీర్చే ఒయాసిస్సులా ఉండే ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లు వేసవి ప్రారంభంలోనే ఎండిపోయి బంజరు భూములను తలపిస్తున్నాయి. రిజర్వాయర్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలు అక్రమ కట్టడాలు, ఆక్రమణలతో నిండిపోయాయి. మిగిలిన రిజర్వాయర్లు సైతం ఏళ్లతరబడి పేరుకుపోయిన సిల్ట్‌ వల్ల వాటి 60 శాతానికి పైగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి.  దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయి నగరానికి తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలా కొనసాగిస్తే మరో పదేళ్లలో చుక్కనీరు దొరకని పరిస్థితి నెలకొంది.రాబోయే గడ్డు పరిస్థితి నుంచి విశాఖ బయటపడాలంటే నగరంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన జీవనశైలిని అవలంబించాలని  నిపుణులు అంటున్నారు.

ఉపరితల నీటి వనరులతో పాటు భూగర్భ నీటి సమతుల్యత, శాస్త్రీయ పర్యవేక్షణ, నీటి యాజమాన్యం ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్‌ తరాల కోసం ఎప్పటికప్పుడు శాస్త్రీయమైన నీటి యాజమాన్య విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు. రిజర్వాయర్లలో పేరుకుపోయిన సిల్ట్‌ తొలగించడం... క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో ఆక్రమణలు తొలగించడం.యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున ఇంకుడు గుంతలు నిర్మించడం.. నీటిని పొదుపుగా వాడుకోవడమే మన ముందున్న మార్గాలని స్పష్టం చేస్తున్నారు.

చొచ్చుకొస్తున్న సముద్రపునీరు
విశాఖలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా మాయమై..చాపకింద నీరులా సముద్రపు ఉప్పనీరు చొచ్చుకొస్తుండడమే అసలు సమస్య. ఇప్పటికే ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, అప్పూగర్, కురుపాం టూంబ్స్, సాగర్‌నగర్‌ భీమిలిలలోని పలు ప్రాంతాల్లో భూగర్భ అంతర్భాగంలోకి సముద్రపునీరు ఊహ కందని రీతిలో చొచ్చుకొచ్చినట్టు పరిశోధనల్లో తేలిందని నిపుణులు అంటున్నారు. నగరంలో లెక్కాపత్రం లేకుండా ఇష్టమొచ్చినట్టుగా బోర్లు వేయడం.. మోతాదుకు మించి భూగర్భ జలాలు విపరీతంగా వాడేస్తూ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు అడ్డూ అదుపూ లేకుండా లక్షల గ్యాలెన్ల నీటిని తోడేస్తున్నారు.

ఇలా తోడేసిన నీటిని రీచార్జ్‌ చేసేందుకు వీలుగా ఆ స్థాయిలో తగినంత వర్షపాతం లేకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతోంది.ఒకవేళ వర్షం కురిసిన ప్పటికీ నగరమంతా కాంక్రీట్‌ జంగిల్‌ కావడంతో నీరుభూమిలోకి ఇంకకుండా నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. నగరంలో చాలా ప్రాంతం ఎత్తయిన కొండలపైనే ఉంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నగరమంతా మడతభూములపైనే ఉంది. నగర విస్తీర్ణంలో చాలా వరకు సుద్దరాయి కావడంతో వర్షపునీరు భూమి పొరల్లోకి వెళ్లకుండా సముద్రంలోకి పంపించేస్తుంది.

తగ్గుతున్న భూసారం
నగర భూమిపొరల్లో మంచినీరు పుష్కలంగా ఉన్నంత కాలం సముద్రపు నీరుని నగరంవైపు రానీయ కుండా వెనక్కి నెడుతుంది.భూగర్భ జలాలు ఏమాత్రం అడుగంటినా భూమి పొరల్లోకి ఖాళీ ప్రదేశంలోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది. ఒక్కసారి సముద్రపు నీరు చొచ్చుకొస్తే ఆ తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా ఉప్పునీటితోనే నిండిపోతుంది. భూ అంతర్భాగంలో ఉప్పునీరు చేరడం వలన ఆ నేల సారాన్ని కోల్పోతుంది. ఆ ప్రాంతంలోని భవనాలు, కట్టడాలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 23లక్షల నగర జనాభాతో పాటు ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ఉత్తరాంధ్ర, ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి వచ్చే మరో నాలుగైదు లక్షల మంది అవసరాలు తీర్చే స్థాయిలో తాగునీటి వనరుల్లేవు. దీంతో అన్ని అవసరాలకు భూగర్భ జలాలపై ఆధార పడాల్సిన పరిస్థితి. భారీ అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ సముదాయాలు పెరిగి పోవడంతో ఒకే ప్రాంతంలో లెక్కకు మించి బోర్లు తవ్వి నిరంతరాయంగా భూగర్భ జలాలు తోడేస్తుండడంతో చుట్టుప్రక్కల కిలోమీటర్ల మేర చుక్కనీరు దొరకని దుస్థితి కన్పిస్తోంది.


వర్షపు నీరు ఇంకే ప్రాంతాల గుర్తింపు..
ఉద్దానం కిడ్నీ వ్యాధి మూలకారణాలపై ఆరేళ్లుగా పరిశోధన చేసి ప్రభుత్వానికి పరిష్కారమార్గాలను చూపిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మనోజ్‌ నలనాగుల ‘ఉప్పుద్రవ’ సమస్యపై లోతైన పరిశోధన చేశారు. మొట్టమొదటిసారిగా కాంటూర్‌ మ్యాపింగ్‌ విశ్లేషణలతో నగరంలో 200కు పైగా వర్షపునీరు ఇంకే ప్రాంతాలను గుర్తించారు. ఈ పరిజ్ఞానంతో వర్షం నీరు ఎక్కడ నుంచి ఎక్కడకు, ఎం త ప్రవహిస్తోందో స్పష్టంగా తెలుసు కోవచ్చు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. నీరు ఒక ద గ్గరకు చేరే గృహసముదాయ ప్రాంతాలను గుర్తించి.. భూగర్భ నీటి యాజమాన్య పద్ధతుల్ని చేపటొ ్టచ్చు. నగరంలో ఇలా కాంటూర్‌ మ్యాపింగ్‌ ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ వలన నగర నీటి భద్రతను పెంచగలమని ప్రొఫెసర్‌ మనోజ్‌ చెబుతున్నారు.అవసరమైతే రోడ్డు కూడలిలో.. రోడ్డు మధ్యలో కూడా రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ నిర్మించుకోవచ్చంటున్నారు. ఏడాది పొడవునా ఇంకుడు గుంతల నిర్వహణ, పర్యవేక్షణను జీవీఎంసీ చేపట్టాలని సూచిస్తున్నారు.

కఠిన నిబంధనలు అవసరం
నగరంలో లెక్కకు మించి వేస్తున్న బోర్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో బోర్లు ఎన్ని ఉన్నాయో.. వాటి ద్వారా రోజూ ఎంత పరిమాణంలో భూగర్భ జలాలను తోడుతున్నారో..  గణాంకాలు సేకరించి వాటి వినియోగంపై నియంత్రణ విధించాలి. నగరంలో ఎన్ని బోర్లు ఉన్నాయో జీవీఎంసీ దగ్గర కూడా పూర్తి లెక్కలు లేవు. కనీస సమాచారం కూడా లేకుండా రిగ్‌లు వేసేస్తున్నారు. ఈ పరిస్థితి లేకుండా బోర్ల తవ్వకాలపై కచ్చితమైన నియమ నిబంధనలు విధించాలి.  సిటీ పరిధిలో బోర్లున్న ప్రతి ఒక్కరూ వర్షపునీటిని సంరక్షించి భూగర్భ జలాలు రీచార్జి చేసేట్టు నిబంధనలు విధించాలి. ఇందుకు ఎన్నో సులువైన పద్ధతులున్నాయి. డాబా పైన పడే వర్షపు నీటికి కిందకు తెచ్చే గొట్టాల మధ్య మామూలు ఫిల్టర్‌లను అమర్చుకుంటే.. ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగించకోవచ్చు. మిగిలిన నీటిని బోరు కనెక్షన్‌కు ఇస్తే అది నేరుగా భూగర్భంలోకి వెళ్తుంది. 
– కేఎస్‌ శాస్త్రి, డెప్యుటీ డైరెక్టర్, భూగర్భ జలవనరుల శాఖ

మినీ రిజర్వాయర్లు ముఖ్యం
నగరంలో ఓపెన్‌ ప్లేస్‌ చాలా ఎక్కువగా ఉంది. ఏయూ, రైల్వే, పోర్టు ఏరియాల్లో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న చెరువులు మాదిరిగా మినీ రిజర్వాయర్లు నిర్మించాలి. వర్షపు నీటిని దాంట్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు చేయాలి. తద్వారా ఆ నీటిని నగర వాసులు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా భూగర్భపొరల్లోకి చేరి భూగర్భ జలాలు పెరిగేందుకు కూడా ఈ రిజర్వాయర్లు దోహదపడతాయి.      – శీలబోయిన సత్యనారాయణ, రిటైర్డ్‌ సీఈ, నీటిపారుదల శాఖ
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా