ఏ కష్టమొచ్చిందో.. ఏమైందో..!

31 Dec, 2018 12:38 IST|Sakshi

ఉపాధికి వచ్చి తిరిగి రాని లోకాలకు

తండ్రి, కుమారుడు, కుమార్తె మృతి 

మరొకరి పరిస్థితి విషమం

విషాహారం తిని ఉండవచ్చని పోలీసుల అనుమానం

 కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఘటన కన్నీరుమున్నీరైన బుడ్డిగరువు ఆదివాసీలు

ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చిందో తెలియడం లేదు.. ఉపాధికి వచ్చి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తిరిగిరాని లోకాలకు చేరారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థల కారణంగా ఒకరిపై ఒకరు పంతానికి పోయి క్షణికావేశంలో పురుగుమందు తాగి.. పిల్లలచేత తాగించి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్నది అంతుచిక్కడం లేదు. భర్త, పిల్లలు మృతిచెందిన గది, పరిసరాల్లో ఇందుకు ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. నోటి నుంచి నురగలు, దుర్వాసన వంటివి రాకపోవడంతో వీరు తీసుకున్న ఆహారం లేదా తాగునీరు విషతు  ల్యమై ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. భార్య కొన ఊపిరితో కొట్టమిట్టాడుతూ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందంటున్నారు. ఈ హృదయ విదారక సంఘటన శనివారం రాత్రి కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో చోటుచేసుకుంది. 

కె.కోటపాడు(మాడుగుల)/అనంతగిరి:  కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పాటు భార్య ప్రాణాపాయ స్థితిలో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. చంద్రయ్యపేటలోని సబ్బవరపు కన్నంనాయుడుకు చెందిన కోళ్లఫారంలో అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బుడ్డిగరువుకు చెందిన పాంగి చిన్నోడు పనికి కుదిరాడు.   భార్యా పిల్లలతో కలిసి ఆరు నెలల కిందట ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాడు. వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతోంది. 

దీంతో పాటు పిల్లల చదువు విషయంలో దంపతులు తరచూ తగాదా పడేవారు. ఈ క్రమంలో రోజూ మాదిరి శనివారం రాత్రి అంతా భోజనం చేసి నిద్రపోయారు. ఆదివారం ఉదయాన్నే వారు కోళ్లఫారంలో లేకపోవడాన్ని గమనించిన  కన్నంనాయుడు వారుంటున్న గది వద్దకు వెళ్లి పిలిచాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా చిన్నారావు(30), ఆయన కుమారుడు సిద్ధు(6), కుమార్తె దీనా(3)లు మృతిచెంది ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో భార్య లక్ష్మి(25)కొట్టుమిట్టాడుతోంది. తలుపులను పెకలించి ఆమెను ఎకాయెకిన కె.కోటపాడు 30 పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించాక విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.  కె.కోటపాడు పోలీసులకు సమాచారం అందించారు. 

చోడవరం సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌.ఐ ఎం.వీ.రమణలు  సంఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. పురుగు మందు తాగి ఉంటారని తొలుత అనుమానించారు. వారుంటున్న గదితో పాటు సమీపంలో వెదికారు. పురుగు మందు అనవాళ్లు కనిపించలేదు. మృతుల నోటి వెంట ఎటువంటి నురగలు రాకపోవడాన్ని గుర్తించారు. దీనిపై చోడవరం సీఐ శ్రీనివాసరావు  మాట్లాడుతూ విషం తీసుకోవడం లేదా విషాహారం తినడం వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి వారు తీసుకున్న ఆహరంతో పాటు నీటిని ల్యాబ్‌కు పరీక్షలకు పంపుతున్నామన్నారు.  చోడవరం సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

పిల్లలను చదివించాలన్నదే చిన్నారావు ఆశ
చిన్నారావు ఎప్పుడూ కొడుకు సిద్ధును బాగా చదివించాలని ఆశపడేవాడు. అందుకే బుడ్డిగరువు నుంచి చంద్రయ్యపేట వచ్చి కోళ్లఫారంలో చేరానని అందరితో చెప్పేవాడు. చంద్రయ్యపేటలోని ప్రాథమిక పాఠశాలలో కొడుకును ఒకటో తరగతిలో చేర్పించాడు. భార్య లక్ష్మి స్వగ్రామం వెళ్ళిపొదామని భర్త చిన్నారావుతో పదేపదే అనేదని స్ధానికులు తెలిపారు. కుమారుడి చదువు మధ్యలో ఆపేయొద్దని ఈ ఏడాది పూర్తయ్యాక వెళ్లిపోదామని చిన్నారావు చెబుతుండేవాడని తెలిపారు.  క్రిస్మస్‌ పండగకు చిన్నారావు భార్య, పిల్లలతో కలిసి బుడ్డిగరువు  ఈ నెల 25న వెళ్లాడు. మళ్లీ 27న సాయంత్రం కుటుంభ సభ్యులతో కలిసి తిరిగి వచ్చాడు. వారు చనిపోయిన గదిలో తలవైపున బైబిల్‌ ఉంది. చిన్నారావు అందరితోనూ సరదాగా ఉండేవాడు. మర్యాదపూర్వకంగా మెలిగేవాడు.

ఆదివాసీల ఆందోళన
చిన్నారావు, పిల్లలు మృతిపై అతని తల్లిదండ్రులు లింగ న్న, వరహలమ్మలతో పాటు ఆ గ్రామానికి చెందిన గిరి జనులు అనుమానం వ్యక్తం చేశారు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారని, ఆర్థిక ఇబ్బందులు కుడా లేవని, కుమారుడి చదువు కోసం చిన్నారావు కుటుంబంతో చంద్రయ్యపేట వచ్చాడని తల్లి వరహలమ్మ విలేఖరులకు తెలిపింది. అటువంటిది కుమారుడు, మనుమలు మరణం పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపింది. ఇప్పుడు వృద్ధాప్యంలో తాము ఎలా బతకాలంటూ వారు రోదించడం స్ధానికులను కలిచివేసింది. ఈమేరకు మృతదేహాల ను పోస్టుమార్టానికి తరలించకుండా గిరిజనులు రోడ్డుపై మంటలు వేసి ఆదివారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు.

లక్ష్మి పరిస్థితి విషమం
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న లక్ష్మి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను అత్యవసర వైద్య విభాగంలో చేర్చి సేవలు అందిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యాధికారులంటున్నారు. 

మరిన్ని వార్తలు