విశాలాంధ్ర మహాసభ ప్రెస్ కాన్ఫరెన్స్ రసాభాస

29 Aug, 2013 01:32 IST|Sakshi
విశాలాంధ్ర మహాసభ ప్రెస్ కాన్ఫరెన్స్ రసాభాస

సాక్షి, హైదరాబాద్: విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బుధవారమిక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. ఈ సందర్భంగా కొందరు విలేకరులు, మహాసభ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత మహాసభ ప్రతినిధి రవితేజ మాట్లాడుతుండగా కొందరు విలేకరులు ప్రశ్నలేశారు. ప్రసంగం పూర్తయ్యాక జవాబిస్తానని ఆయన చెప్పగా.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతే విలేకరుల సమావేశం ఎందుకు పెట్టారంటూ వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ విశాలాంధ్ర ప్రతినిధులు ప్రసంగాలు కొనసాగించారు. ఈలోగా విశాలాంధ్ర మహాసభకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో లిక్కర్ మాఫియా కేసులో ఉన్నాడని కొందరు విలేకరులు వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
 
  ప్రశ్న అడిగిన విలేకరిని విశాలాంధ్ర ప్రతినిధులు మీదే పత్రికో చెప్పాలని అడిగారు. ‘మాది ఏ పత్రికైతే మీకెందుకు.. అడిగిన ప్రశ్నకు జవాబివ్వండి’ అంటూ అదేస్థాయిలో నిలదీయడం.. ఈ క్రమంలో ఆ విలేకరులు, నిర్వాహకుల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుని ఉద్రిక్తత నెలకొంది.

 దీంతో పోలీసులు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులను ప్రెస్‌క్లబ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. అంతకుముందు విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, ప్రతినిధి రవితేజలు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సమైక్యత యాత్ర చేపట్టామని, ఇందులోభాగంగా రెండున్నరవేల కిలోమీటర్లు తిరిగామని, లక్షలాది మందిని కలిశామని చెప్పారు. రెండు విడతల యాత్ర విజయవంతమైందని, అయితే మూడోవిడత యాత్ర కొనసాగించేందుకు ప్రభుత్వం సహకరించట్లేదని, అనుమతివ్వట్లేదని ఆక్షేపించారు.

 

సీమాంధ్ర ప్రజాప్రతినిధులు నకిలీ రాజీనామాలతో ప్రజల్ని మోసగిస్తున్నారని తప్పుపట్టారు. తక్షణం వారు రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు వెంకటేశ్వర్, శ్రీనివాస్‌రెడ్డి, రామజోగయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి మాట్లాడుతూ.. తమ ఆహ్వానం లేకుండా వచ్చిన విలేకరులే సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని విమర్శించారు.

మరిన్ని వార్తలు