షాకింగ్‌: దివ్య శరీరంపై 33 గాయాలు!

6 Jun, 2020 18:39 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దివ్య కేసును పోలీసులు ఛేదించారు. చట్ట వ్యతిరేక కార్యాకలాపాల్లో భాగంగా డబ్బు పంపకంలో తేడాలు రావడంవల్లే ఆమెను హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు దివ్య మృతదేహానికి పోస్ట్‌మార్టంలో పలు విషయాలు వెల్లడైయ్యాయి. ఆమె శరీరంపై 33 గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరి నగర్‌ కాలనీలో ఈనెల 3వ తేదీ అర్ధరాత్రి ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంటి యజమానురాలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలుగో టౌన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో యువతి (22) దివ్య మృతదేహాన్ని కుటుంబసభ్యులు మేడపై నుంచి కిందకు దించారు. (దివ్యది హత్యే!)

గుట్టుచప్పడు కాకుండా శ్మశానవాటికకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్ధానికుల కంటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి శరీరంపై గాయాలు ఉండటంతో ఇంటి యజమానురాలు వసంత (అలియాస్‌ జ్యోతి)పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా దివ్య గత ఎనిమిది నెలలుగా వసంత ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వసంతను విచారించిన సమయంలో.. ఆమె చెప్పిన వివరాలతో ఘటనకు పొంతన కుదరలేదు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు.

ఇక తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్యను ఆమె చిన్నాన్న, పిన్ని కలిసి వసంతకు అప్పగించినట్లు పోలీసు విచారణలో తేలింది. అప్పటి నుంచి దివ్య వసంత ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు విచారించారు. ఈ క్రమంలోనే షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి. దివ్యచే అసాంఘిక కార్యక్రమాలు చేయించాలని వసంత పట్టుబట్టగా..దానికి ఆమె నిరాకరించింది. దీంతో దివ్యను చిత్రహింసలకు గురిచేసి చివరికి వసంతే హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. హత్యకు గురైన దివ్య తల్లి, సోదరుడు, అమ్మమ్మ 2015లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ ముగ్గురి మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవడం గమనార్హం. దీంతో దివ్య హత్య కేసుతో పాటు ఆ హత్యలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా