జూపార్క్‌ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం -మంత్రి

9 Oct, 2019 12:06 IST|Sakshi

విశాఖపట‍్నం : విశాఖ ఇందిరా గాంధీ జూపార్క్ లో 65వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ పాల్గొన్నారు. రూ. 70 లక్షల నిధులతో అభివృద్ది చేయనున్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వీరు శంఖుస్థాపన చేశారు. మంగుళూరు నుంచి తీసుకొచ్చిన రెండు కొత్త పులులను జూలో సందర్శకులు చూడడానికి అవకాశం కల్పించారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల ముగింపు వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ.. విశాఖ జూ పార్క్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి విశాఖకు వచ్చే పర్యాటకులు జూ పార్క్‌ని సందర్శించేలా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంక్‌ నిధులతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు, రాబోయే రోజుల్లో సీఎంతో మాట్లాడి జూపార్క్‌ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో భాగంగా విశాఖలో కోటి మొక్కలు నాటే ప్రణాళికలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే విశాఖ జూ కి ఓ ప్రత్యేకత ఉంది. 625 ఎకరాలలో సహజ సిద్దంగా ఏర్పడిన జూ ఇది. హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖ జూని తరలించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మన ప్రభుత్వంలో విశాఖ జూని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎఫ్‌ రాహుల్‌పాండే, ఇంచార్జి కలెక్టర్‌ శివశంకర్‌, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్‌, కేకే రాజు, జూ క్యూరేటర్‌ యశోద బాయి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు