ఫీడ్‌బ్యాక్‌లో నంబర్‌ వన్‌

5 Jan, 2020 08:49 IST|Sakshi
స్వచ్ఛతా యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్న వలంటీర్‌

స్వచ్ఛతలో ఏడో స్థానం

ఎనిమిది ప్రశ్నలే కీలకం

10లోపు ఢిల్లీ బృందం వచ్చే అవకాశం

ఇదే రీతిన ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

విశ్వ నగరి విశాఖ స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ విషయంలో ఇన్నాళ్లూ వెనుకబడిన విశాఖ నగరం ఇప్పుడు ప్రజా చైతన్యంతో ఏకంగా మొదటి స్థానానికి చేరుకుంది. ఈ నెల 31 వరకూ ప్రజలు ఇదే రీతిలో స్పందించి ఈ స్థానాన్ని నిలబెడితే టాప్‌–10లో నిలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకూ వచ్చిన ప్రాతిపదికల ఆధారంగా చూస్తే రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా విశాఖ నగరం ఉంది. అదే దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏడో స్థానంలో నిలిచింది. మొత్తంగా వైజాగ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌–2020లో అప్రతిహతంగా దూసుకుపోవాలంటే ప్రజలు ఇదే తరహాలో ప్రోత్సహించాలి.

సాక్షి, విశాఖపట్నం:స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఢిల్లీ బృందం చేపట్టే కీలకమైన ప్రత్యక్ష పరిశీలన ఈ నెల 31లోగా జరుగుతుంది. విశాఖ నగరానికి ఈ నెల 10లోపు వచ్చే అవకాశం ఉందని జీవీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ బృందం అడిగే ఎనిమిది కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తే  మహా నగరం మంచి ర్యాంకుని సాధిస్తుంది. ఆ ప్రశ్నలివీ..

1. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మీ సిటీ పాల్గొంటుందని మీకు తెలుసా..?
అవునని సమాధానం వస్తే అత్యధిక మార్కులు వస్తాయి.
2). మీ పరిసరాల పరిశుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.?
• గరిష్టంగా 10 మార్కులు ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకుకి ఉపయోగపడుతుంది.
3). వాణిజ్య, పబ్లిక్‌ ప్రాంతాల్లో శుభ్రత స్థాయిపై మీ సిటీకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు.?
• 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది.
4). మీ చెత్త పట్టుకెళ్లేవారు తడి పొడి చెత్త వేరుగా ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నారా.?
• అవును.. ప్రతి రోజూ అడుగుతున్నారు అని చెబితే ఉపయుక్తంగా ఉంటుంది.
5). మీ సిటీలోని రోడ్డు డివైడర్స్‌ పచ్చదనం పెంపొందించేలా మొక్కలతో కవర్‌ చేశారా.?
• అవును, అన్ని రోడ్లు డివైడర్లు గ్రీనరీతో నిండాయి అని చెబితే ర్యాంకుకి ఉపయోగపడుతుంది.
6). మీ సిటీలోని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్స్‌ పరిశుభ్రతకు ఎన్ని మార్కులు ఇస్తారు.?
• 10 మార్కులు వరకూ ఇవ్వవచ్చు. 10కి పది ఇస్తే ర్యాంకు సాధించేందుకు వీలవుతుంది.
7). మీ సిటీ ఓడీఎఫ్‌(బహిరంగ మల విసర్జన రహిత) స్థితి మీకు తెలుసా.?
• ఇటీవలే జీవీఎంసీ ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ నగరంగా ధ్రువీకరించబడింది. కాబట్టి.. ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ నగరంగా చెబితే చాలు.
8). మీ సిటీ గార్బేజ్‌ ఫ్రీ సిటీ స్టార్‌ రేటింగ్‌ స్థితి మీకు తెలుసా.?
జీవీఎంసీ 5 స్టార్‌ రేటింగ్‌ నగరంగా గుర్తింపు పొందేందుకు దరఖాస్తు చేసుకుంది.

ఇప్పటివరకు స్వచ్ఛతలో  రాష్ట్ర స్థాయి ర్యాంకు– 1
ఇప్పటివరకు స్వచ్ఛతలో దేశ స్థాయిలో  ర్యాంకు– 7
ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌ నగరంగా  ధ్రువపత్రం సాధించిన జీవీఎంసీ
గార్బేజ్‌ ఫ్రీ సిటీగా 5 స్టార్‌ రేటింగ్‌కు  దరఖాస్తు

ప్రజలే వారధులు..
స్వచ్ఛతలో నగరాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టేందుకు జీవీఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. కీలకమైన ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తే.. వైజాగ్‌ మంచి ర్యాంకు సాధించగలదు. కమిషనర్‌ సూచనలతో నగర వ్యాప్తంగా 8 ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల సహకారం ఈ నెల 31 వరకూ అందిస్తే.. టాప్‌–10లోకి దూసుకుపోతాం.
– విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ 

మరిన్ని వార్తలు