విష్ణుమూర్తితో తెనాలికి జాతీయ స్థాయి కీర్తి

18 Jun, 2016 01:14 IST|Sakshi
విష్ణుమూర్తితో తెనాలికి జాతీయ స్థాయి కీర్తి

తెనాలి : విశిష్టమైన అవార్డుతో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తెనాలికి జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన యలవర్తి నాయుడమ్మ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి హఠాన్మరణం తీరని లోటని పలువురు ప్రముఖులు తమ శ్రద్ధాంజలి సంతాపంలో పేర్కొన్నారు. గుండెపోటుతో మృతిచెందిన విష్ణుమూర్తి భౌతికకాయాన్ని శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులు సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెనాలికి కీర్తిని తీసుకొచ్చిన అంశాల్లో నాయుడమ్మ ట్రస్ట్ ఒకటని, విష్ణుమూర్తి నిర్వహణ కారణంగానే ఆ గుర్తింపు లభించిందని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఒక నిష్కామకర్మగా రెండున్నర దశాబ్దాలుగా 23 మంది శాస్త్రవేత్తలను తెనాలికి రప్పించి, నాయుడమ్మను జనం గుండెల్లో బతికిస్తూనే ఉండటం అరుదైన విషయమని చెప్పారు.


మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ,  కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, గౌతమ్‌గ్రాండ్ హోటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, డాక్టర్ కొత్త శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ వి.శేషగిరిరావు, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, రచయిత ఎండీ సౌజన్య, నాయుడమ్మ ట్రస్ట్ సభ్యులు సూరెడ్డి సూర్యమోహన్, రాచాబత్తుని శ్రీనివాసరావు, బలభద్రరావు, ప్రముఖ శిల్పి ఎ.రామకృష్ణ, సూర్యకుమారి, ప్రసాద్, ఆలపాటి వెంకట్రామయ్య, బూరెల దుర్గ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్, విజయవాడ ప్రముఖుడు ప్రభాకర్, విలేకరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.


 ప్రముఖుల సంతాపం...
 తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, చిత్తూరు సీనియర్ సివిల్ జడ్జి వేల్పుల కృష్ణమూర్తి, నాయుడమ్మ మనుమరాలు అంజనా, దూరదర్శన్ రిటైర్డ్ డిప్యూటీ డెరైక్టర్ యార్లగడ్డ శైలజ ఫోనులో సంతాపాన్ని తెలియజేశారు.

 ఘనంగా అంతిమయాత్ర...
మధ్యాహ్నం 3.45 గంటలకు అంతిమయాత్ర ప్రారంభించారు. రామలింగేశ్వరపేటలోని ఆయన నివాసం నుంచి సత్యనారాయణపార్కురోడ్ మీదుగా చినరావూరు శ్మశానస్థలికి చేరుకొంది. అక్కడ శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.
 
 
 24వ నాయుడమ్మ ట్రస్ట్ అవార్డు సభ సన్నాహాల్లో ఉండగా అస్వస్థత..
యలవర్తి నాయుడమ్మ స్మారక ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ పి.విష్ణుమూర్తి (69) రామలింగేశ్వరపేట నివాస గృహంలో హఠాన్మరణం చెందారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్న విష్ణుమూర్తికి గురువారం రాత్రి గుండెపోటు రావటంతో కన్నుమూశారు. స్థానిక వీఎస్‌ఆర్ కాలేజిలో కామర్స్ అధ్యాపకుడిగా పనిచేశారు విష్ణుమూర్తి, యూఎన్‌ఐ వార్తాసంస్థకు తెనాలి ప్రతినిధిగా కొంతకాలం వ్యవహరించారు. జపాన్, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల వ్యాప్తి లక్ష్యంతో భారత-జపాన్ మైత్రీసంఘం ఏర్పాటు చేసి పదేళ్లు నిర్విరామంగా పలు విభిన్న కార్యక్రమాలు జరిపారు. 1985లో కనిష్క విమాన ప్రమాదంలో తెనాలికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ దుర్మరణం చెందడం విష్ణుమూర్తిని కలచివేసింది. ఆయన స్ఫూర్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని భావితరాలకు అందించాలని నిర్ణయించుకొని నాయుడమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 23 మంది ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయస్థాయి శాస్త్రవేత్తలను తెనాలికి రప్పించి నాయుడమ్మ అవార్డుతో సత్కరిస్తూ వచ్చారు. 24వ అవార్డు సభకు సన్నాహాల్లో ఉండగా అస్వస్థతకు గురవడం ఆయన ప్రాణాలమీదికొచ్చింది. ఆయన వివాహం చేసుకోలేదు. సోదరులు, సోదరీమణులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు