ఆ ఇద్దరికీ మరింత సెగ

27 Sep, 2013 03:07 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పినిపే విశ్వరూప్ గురువారం సమైక్యాంధ్ర కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని హైదరాబాద్‌లో ప్రకటించారు. కాంగ్రెస్ పునరాలోచన చేసి, విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే పార్టీలో కొనసాగుతానని, అందుకు నవంబర్ ఒకటోతేదీ డెడ్‌లైన్ అని చెప్పారు. అప్పటికీ విభజనపై కాంగ్రెస్ వెనక్కు తగ్గకపోతే పార్టీకి కూడా గుడ్‌బై చెపుతానన్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందచేసి తక్షణం ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వరూప్ రాజీనామా చేయడంతో జిల్లాలో మరో రాష్ట్ర మంత్రి తోట నరసింహం, కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజుల మాటేమిటని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మంత్రి పదవులను పట్టుకు వేలాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
రాష్ట్ర మంత్రులు తోట, పినిపే ఆగస్టు నెల మొదట్లో వారం రోజుల తేడాలో రాజీనామా చేశారు. అయితే రాజీనామాలను ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్‌కు అందచేశారు. కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు రాజీనామా మాట అటుంచి సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన తరువాత  కనీసం జిల్లావైపు కన్నెత్తి చూడనేలేదు. రాష్ట్ర మంత్రుల రాజీనామాలను సమైక్యవాదులు రాజీడ్రామాలుగా అభివర్ణిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమంలో వారి చిత్తశుద్ధిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జిల్లాలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విశ్వరూప్ రాజీనామాతో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. 
 
తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని కూడా విశ్వరూప్ తెలిపారు. కాగా, విశ్వరూప్ రాజీనామా చేయడంతో తోట నరసింహం రాజీనామా కోసం సమైక్యవాదులు ఎదురు చూస్తున్నారు. తాను ప్రారంభంలోనే రాజీనామా చేశానని మంత్రి తోట చెపుతున్న మాటలకు విశ్వసనీయత లేదని వారు విమర్శిస్తున్నారు. 15 రోజులుగా మంత్రి తోట ఎక్కడకు వెళితే అక్కడ సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. తాను రాజీనామా చేశానని చెపితే సరిపోదని, విశ్వరూప్ మాదిరిగా రాజీనామాను గవర్నర్‌కు అందచేసి ఆమోదింపజేసుకోవాలని ఇప్పుడు సమైక్యవాదులు తోటను డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ తోట రాజీనామా డ్రామాగానే మిగులుతుందంటున్నారు.
 
పళ్లంరాజు ఏం చేస్తారో?
మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 58 రోజుల్లో ఏ ఒక్క రోజూ కేంద్ర మంత్రి పళ్లంరాజు జిల్లాలో అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోయారు. పైకి మాత్రం సమైక్యాంధ్ర ముందు తన మంత్రి పదవి పెద్ద విషయం కాదని చెప్పుకొన్నారు. కానీ మంత్రి పదవిని వదల్లేక, సమైక్యాంధ్ర ఉద్యమానికి భయపడి ఢిల్లీకే పరిమితమయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తేనే విభజన నిర్ణయం వెనక్కు తీసుకుంటుందని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్, ఏపీఎన్‌జీఓల అధ్యక్షుడు అశోక్‌బాబు పదేపదే చెపుతున్నా పళ్లంరాజు స్పందించకపోవడం సమైక్యాంధ్రపై ఆయన చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని జిల్లా జేఏసీ ప్రతినిధులంటున్నారు. ప్రజాప్రతిఘటన ఎదురైనా మిగిలిన కేంద్ర మంత్రులు తమ జిల్లాల్లో ఏదో సందర్భంలో పర్యటించినా పళ్లంరాజు ఆ సాహసం చేయలేదు. ఆయన జిల్లాలో అడుగుపెడితే తరిమికొట్టాలని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సహా పలువురు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో గురువారం పళ్లంరాజు సోనియాగాంధీతో 20 నిమిషాల సేపు జరిపిన భేటీలో ఏ విషయాలు చర్చించారు, సమైక్యాంధ్ర కోసం అసలు ఏమైనా మాట్లాడారా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన పదవిని వదులుకుంటారా లేక, పదవిని అంటిపెట్టుకుని ఢిల్లీకే పరిమితమవుతారో వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలు