అభివృద్ధి రవ్వంత.. దోచేది కొండంత

16 Oct, 2018 11:01 IST|Sakshi

కూడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగున్నర ఏళ్లలో ప్రజా ధనాన్ని దోచుకుంది కొండంత .. అభివృద్ధి చేసింది గోరంత అని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్యజమెత్తారు. సోమవారం కూడేరు మండల పరిధిలోని చోళసముద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు  ‘రావాలి జగన్‌...కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త పీడీ రంగయ్యలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టే నవరత్నాల పథకాల  గురించి వివరించారు.

 ఈ సందర్భంగా ప్రజలు సమస్యలను వారితో ఏకరువు పెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతు అనంతపురం జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నా .. కరువు సహాయక చర్యలు చేపట్టకుండా సీఎం చంద్రబాబు తాను చేసిన గోరంత అభివృద్ధిని కొండంత చేసి చెబుతు ప్రజలను మభ్యపెడుతున్నారుని మండి పడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంగా  హంద్రీ నీవా కాలువ ఏర్పాటు చేస్తే నీరు ఇవ్వకుండా ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కూడా నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేశారన్నారు. కేశవ్‌తో పాటు ఆయన అనుయాయులకు దోచుకోవడమే సరిపోయిందని విమర్శించారు. 

కేబినెట్‌లో ఐటీ దాడులపై చర్చనా? 
కేబినెట్‌లో ప్రజా సమస్యలపై చర్చించకుండా ఐటీ దారులపై చర్చించడం సిగ్గుచేటని అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త పీడీ రంగయ్య విమర్శించారు. చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బును కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో పంచారన్నారు.  ఆయన పాలనంతా అవినీతిమయమే కాబట్టి ఐటీ దాడులు చేస్తే తమ అవినీతి బాగోతం ఎక్కడ బయట పడుతుందోనని బాబు జంకుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ రాజశేఖర్‌ , జడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, నాయకులు మాదన్న, నాగేంద్ర ప్రసాద్, తిమ్మారెడ్డి, గంగాధర్, పెన్నోబులేసు, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు