విషమించిన విఠల్ ఆరోగ్యం

29 May, 2016 02:43 IST|Sakshi
విషమించిన విఠల్ ఆరోగ్యం

వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వైనం
మెరుగైన వైద్యం కోసం ప్రైపెవేట్ ఆస్పత్రికి తరలింపు
 

అనంతపురం : నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఎస్కేయూ రిటైర్డ్ డెప్యూటీ రిజిస్ట్రార్ కె.విఠల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా శనివారం సాయంత్రం వరకు ఆయన తేరుకోలేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విఠల్ కుమారుడు వీఎస్ సాయిచైతన్య నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసకున్న సంగతి తెలిసిందే. ఆ జంట ఆజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి సమాచారం చెప్పాలంటూ యువతి బంధువులు విఠల్ దంపతులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన విఠల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి విదితమే.


 కలకలం రేపుతోన్న వేలిముద్రల సేకరణ
 ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న విఠల్ వద్దకు శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు వెళ్లి ఖాళీ తెల్లటి కాగితాలపై విఠల్ వేలిముద్రలు తీసుకోవడం కలకలం రేపుతోంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తన భర్త నుంచి బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారంటూ ఆయన భార్య వాపోయారు.

మరిన్ని వార్తలు