గుంటూరు జిల్లాకు కొత్త జేసీ వివేక్‌యాదవ్ నియామకం

9 Oct, 2013 03:09 IST|Sakshi
సాక్షి, గుంటూరు: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వివేక్‌యాదవ్‌ను నియమితులయ్యారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను గుంటూరుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత జేసీ డి.మురళీధర్‌రెడ్డిని హైదరాబాద్ సచివాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో వస్తున్న వివేక్‌యాదవ్ 2008 ఐఏఎస్ బ్యాచ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయనకు ఆదిలాబాద్‌జిల్లా మంచిర్యాల సబ్ కలెక్టర్‌గా 2010 సెప్టెంబర్ 2న తొలిపోస్టింగ్ లభించింది. అక్కడ సమర్థవంతమైన అధికారిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
2011 సెప్టెంబర్ 3న మంచిర్యాల నుంచి బదిలీ చేయగా..ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈయన బదిలీపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 19 వరకు మంచిర్యాల సబ్ కలెక్టర్ పొడిగించింది. ఆ తర్వాత రాష్ర్ట స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా 40 రోజుల పాటు పనిచేశారు. అనంతరం వరంగల్ బల్దియా కమిషనర్‌గా వచ్చారు. జాతీయ స్థాయిలో వరంగల్ నగర పాలక సంస్థకు గుర్తింపు రావడంలో కమిషనర్ వివేక్‌యాదవ్ కృషి ఎంతగానో ఉంది. జాతీయ స్థాయిలో మూడు, రాష్ట్రస్థాయిలో నాలుగు ఆవార్డులు స్వీకరించారు.
 
చక్కని పనితీరు చూపిన మురళీధర్
ఐఏఎస్-2007 బ్యాచ్‌కు చెందిన డి.మురళీధర్‌రెడ్డి మార్చి 21న గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ఆర్నెల్లకాలం పనిచేశారు. పంచాయతీ ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించిన ఆయన.. ఏడోవిడత భూపంపిణీకి సంబంధించి భూసేకరణ పనుల్ని కూడా ముమ్మరం చేశారు. ఆధార్‌కార్డుల జారీలో రాష్ట్రంలోనే ముందంజలో ఉంచేందుకు కృషిచేశారు. గ్రామీణప్రాంతాల్లో ఆధార్ ఆవస్యకతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. 
 
అమ్మహస్తం పథకానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ వ్యవహారాలన్నింటినీ కంప్యూటరైజ్డ్ చేయించి, జిల్లాలోని 20 ఎంఎల్‌ఎస్ పాయింట్‌ల నుంచి రేషన్ దుకాణాల రవాణా వ్యవహారాలపై నిఘా పెంచడంలో సఫలీకృతులయ్యారు. పులిచింతల పునరావాస శిబిరాల పనుల్లో పురోగతి సాధించారు. రెవెన్యూ సదస్సుల్లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. జిల్లాలో బాధ్యతలు నిర్వర్తించిన ఆర్నెల్లకాలం చాలా సంతృప్తినిచ్చిందని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. 
 
మరిన్ని వార్తలు