అడ్డు తొలగించుకోవాలనే హత్య

28 Mar, 2019 08:00 IST|Sakshi
వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి 

‘ఎన్నికల్లో గెలవడానికి ఆదినారాయణరెడ్డికి మా నాన్న అడ్డంకిగా కనిపించారు. అడ్డు తొలగిస్తే తప్ప గెలవలేమని ఆదినారాయణరెడ్డి భావించారు. ఈ విషయాన్ని సిట్‌ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా.. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డిని మాత్రం విచారణ చేయలేదు. మా కుటుంబ సభ్యులను మాత్రం పదేపదే విచారిస్తున్నారు. మా నాన్న వైఎస్‌ వివేకా హత్యతో పరమేశ్వరరెడ్డి పాత్ర ఉంది. నాన్న చనిపోయి ఇన్నిరోజులైనా.. వాస్తవాలను ఎందుకు బయటపెట్టడం లేదు. మా బంధువులను అదుపులోకి తీసుకుని పది రోజులైంది. మాకున్న అనుమానాలపై అధికారులకు వివరాలు ఇచ్చినా.. ఆ దిశగా విచారణ చేయడం లేదు. పోయింది మా మనిషే. పైగా మా మీదే నింద పడింది. నాన్న చనిపోయాడని నేను, చిన్నాన్న చనిపోయాడని జగన్‌ అన్న బాధలో ఉంటే సానుభూతి వదిలేసి నిందలు వేయడం న్యాయమా?. నిజంగా నాన్న హత్యకేసులో మా కుటుంబంలోని వ్యక్తికే సంబంధం ఉంటే.. చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు బయట పెట్టకుండా ఆగేవారా?’ 
–హైదరాబాద్‌లో మీడియాతో వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి 


చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా 

మాయమాటలు నమ్మి.. టీడీపీ అధినేత చంద్రబాబు చేతిలో నిలువునా మోసపోయా. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని.. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తానని నమ్మించి నన్ను టీడీపీలో చేర్చుకున్నారు. చివరకు మోసగించారు. అన్నదమ్ముల్లా ఉండే మాల–మాదిగల మధ్య చిచ్చుపెట్టిన చరిత్ర చంద్రబాబుది. ఈ రాష్ట్రంలో మాదిగలు సభలు జరుపుకోకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఎంఆర్పీఎస్‌ సభకు అనుమతివ్వాలని స్వయంగా నేనే వెళ్లి చంద్రబాబును అడిగా. ఇచ్చే ప్రసక్తే లేదని నాపై సీరియస్‌ అయ్యారు. నా దగ్గర డబ్బులేదనే టీడీపీ టికెట్‌ ఇవ్వలేదు. సామాన్యులకు టికెట్‌ ఇచ్చే గొప్ప వ్యక్తి వైఎస్‌ జగన్‌. అందుకు నిదర్శనం బాపట్ల పార్లమెంట్‌ సీటు పేదవాడైన నందిగం సురేశ్‌కు టికెట్‌ ఇవ్వడమే. ఎమ్మెల్యేను చేసిన పార్టీని కాదని టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశా.’ 
–ఒంగోలులో మీడియాతో యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు  

మరిన్ని వార్తలు