వివేకానందుడి బోధనలు అనుసరణీయం

17 Dec, 2013 03:41 IST|Sakshi

=రామకృష్ణ సేవా సమితి బాధ్యుడు చిటికానంద మహరాజ్
 =కేయూకు చేరిన రథయాత్ర
 =ఘన స్వాగతం పలికిన విద్యార్థులు, అధికారులు


కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎప్పటికీ ఆదర్శంగా నిలిచే వివేకానందుడి బోధనలను అందరూ అనుసరించాలని హైదరాబాద్‌లోని రామకృష్ణ సేవా సమితి బాధ్యులు స్వామి చిటికానంద మహరాజ్ సూచించారు. వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రామృష్ణ సేవా సమితి, జయంత్యుత్సవాల సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి ప్రారంభించిన రథయాత్ర సోమవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీకి చేరింది. ఈ సందర్భంగా కాన్వొకేషన్ మైదానంలో ఏర్పాటుచేసిన సభలో మహరాజ్ మాట్లాడారు.
 
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

విద్యార్థుల్లో వ్యక్తిత్వ నిర్మాణం పెంపొందేలా విద్యావిధానం ఉండాలని చిటికానంద అభిప్రాయపడ్డారు. విద్యార్థులు మానవత్వంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించా రు. ఇందులో ఎక్కడా భారతీయ సంప్రదాయాలు, విలువలు, సనాతన ధర్మాన్ని విస్మరించొద్దని కోరారు. సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం మాట్లాడుతూ వివేకానందుడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు.

రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి వివేకానందుడి జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందాలని సూచించారు. తొలుత కేయూకు చేరుకున్న రథయాత్రను రెండో గేట్ వద్ద రిటైర్డ్ అధ్యాపకుడు గుజ్జల నర్సయ్య ప్రారంభించగా, పరిపాలనా భవనం నుంచి కాన్వొకేషన్ మైదారం వరకు వీసీ వెంకటరత్నం యాత్ర వెంట నడిచారు. అలాగే, యాత్ర సాగిన దారి పొడవునా విద్యార్థులు పూలతో స్వాగతించారు. ఇంకా వివేకానందుడి విగ్రహానికి పలువురు పూలమాలలు వేశారు.

సమావేశంలో రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి మురళీధర్, ప్రభుచైతన్య, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.దామోదర్, ప్రొఫెసర్లు రాజయ్య, బాలస్వామి, వివిధ సంఘాల బాధ్యులు రావుల కృష్ణ, నమిండ్ల సుమన్, తిరుపతి, రాజేష్, పరశురాం తదితరులు పాల్గొన్నారు. కాగా, వివేకానందుడి జీవిత చరిత్ర-సందేశం పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
 

మరిన్ని వార్తలు