సమైక్య సెగ.. విభజనకారకులపై వెల్లువెత్తిన ఆగ్రహం

1 Aug, 2013 03:27 IST|Sakshi

సమైక్యకాంక్ష పెల్లుబికింది. రెండో రోజు బుధవారం నగరవాసుల ఆగ్రహాగ్ని మరింత రేగింది. బంద్‌లో స్వచ్ఛందంగా వాణిజ్యవేత్తలు, వ్యాపారులు పాల్గొన్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఎన్జీవోలు, విద్యార్థి, శ్రామిక, మహిళాలోకం చేసిన సమైక్య నినాదాలు ప్రతిధ్వనించాయి.    
 
 ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవా రం సాయంత్రం ఏయూలో ఏడు దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లగడపాటి రాజగోపాల్, చిరంజీవి, పురందేశ్వరి, బొత్స సత్యనారాయణ, చంద్రబాబు నాయుడుల దిష్టిబొమ్మలను వర్సిటీ మెయిన్‌గేట్ ఎదురుగా దహనం చేశారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో నేతల అసమర్థతల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని విద్యార్థి నేతలు విమర్శించారు. జేఏసీ నాయకులు లగుడు గోవిందరావు, ఆరేటి మహేష్, సురేష్ కుమార్, బి. కాంతారావు కార్యాచరణ ప్రకటించారు.
 
 గురువారం బంద్, ర్యాలీలు, దిష్టి బొమ్మల దహనం నిర్వహిస్తారు. శుక్రవారం మంత్రుల ఇళ్లముట్టడి, రహదారుల దిగ్బంధం, శనివారం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి, వంటావార్పు చేపడతారు. ఆగస్టు 6న వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. సమైక్యాంధ్రను కోరుతూ ఎవ రూ ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. విద్యార్థుల ఉద్యమానికి పలువురు సం ఘీభావం తెలిపారు. ఏపీ ఎన్జీఓ సం ఘం సభ్యులు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, విద్యుత్ ఉద్యోగుల సంఘం సభ్యుడు పోలాకి శ్రీనివాస్, ఏయూ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బొట్టా రామచందర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కర్రి ఆదిబాబు, వర్సిటీ ఆచార్యులు విద్యార్థులకు తమ మద్దతు తెలిపారు.
 
 వైఎస్సార్ సీపీ నేతల సందర్శన   
 ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేస్తున్న ఆమరణ దీక్షల శిబిరాన్ని వైఎస్సార్ సీపీ నేతలు సందర్శించారు. వైసీపీ నేతలు దాడి వీరబధ్రరావు, మాజీ కార్పొరేటర్ జీవీ రవిరాజు సందర్శించి విద్యార్థులకు బాసటగా నిలిచారు. ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా శిబిరాన్ని సందర్శించారు.
 
  విద్యార్థులకు వీసీ మద్దతు
 ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: ఆంధ్ర విశ్వవిద్యాలయం లో విద్యార్థులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షల శిబిరాన్ని వర్సిటీ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్ రాజు సందర్శించారు. విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమా న్ని చేయాలని సూచించా రు. అనంతరం విద్యార్థుల ఆరోగ్యంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినన్నారు.  
 
 సమైక్య బంద్ స్వచ్ఛందం
 విశాఖపట్నం: రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యాంధ్ర జేఏసీ, వివిధ రాజకీయ పార్టీలు తలపెట్టిన 72 గంటల బంద్ మొ దటి రోజు బుధవారం ప్ర శాంతంగా జరిగింది. వ్యా పారులు, విద్యాసంస్థలు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాయి.  ఆటోలు, బస్సులు తిరగకుండా జేఏసి నేతలు అడ్డుకున్నారు. సిరిపురం, ఆశీల్‌మెట్ట, వాల్తేర్ అప్ ల్యాండ్, బీచ్‌రోడ్, పాండురంగాపురంలలో ఉదయం నుంచే రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.  
 
  ఎమ్మెల్యేలను నిలదీసిన విద్యార్థులు
 ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: విద్యార్థుల దీక్షా శిబిరాన్ని సందర్శించడానికి వచ్చిన శాసన సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్‌లకు చుక్కెదురైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా శాసన సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని విద్యార్థుల డిమాండ్ చేశారు. బొత్స, చిరంజీవి వైఖరిని విద్యార్థులు నిరసించారు.  
 
 సంఘీభావం: విద్యార్థి జేఏసీ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సుజయకృష్ణ రంగారావు, వంశీకృష్ణ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని  విడదీస్తున్నారన్నారు.  విద్యార్థుల నిరసన కార్యక్రమానికి అడుగడుగునా పోలీసులు అడ్డుతగిలారు.  
 
  ఐక్య సంఘాల ఆందోళన
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా చేపట్టిన 72 గంటల బంద్‌లో భాగంగా బుధవారం మద్దిలపాలెం కూడలిలో సమైక్యాంధ్ర ఐక్య సంఘా లు ఆందోళన చేపట్టాయి. మద్దిలపాలెం హైవేపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.  ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ జేటీ రామారావు మాట్లాడుతూ  ఓటుబ్యాంకు రాజకీయాలు, వ్యక్తిగత ఎదుగుదలకు పెద్దపీఠ వేస్తూ, తెలుగు తల్లిని నిలువునా చీల్చే దారుణానికి ఒడిగట్టారన్నారు.  సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించకపోతే మూల్యంచెల్లించక తప్పదన్నారు. కార్యక్రమంలో సురేష్ మీనన్, సమైక్యాంధ్ర మహిళా జేఏసీ నాయకురాలు, చెక్క రమాదేవి, సముద్రాల శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు