ఏ క్షణమైనా షట్‌డౌన్‌?

30 Nov, 2017 10:50 IST|Sakshi

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వేధిస్తున్నముడి ఇనుము కొరత..

రెండ్రోజులకే నిల్వలు

ఒకటి, రెండ్రోజుల్లో ఒక ఫర్నేస్‌లో ఉత్పత్తి నిలిపివేత!

సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముడి ఇనుము కొరత వేధిస్తోంది. ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఎప్పుడూ నెలరోజులకు సరిపడా నిల్వ ఉండేది కాగా, ప్రస్తుతమున్న స్టాక్‌ రెండ్రోజులకు కూడా సరిపడేలా లేదంటున్నారు. ఈ రోజు ర్యాక్‌ వస్తే సరి.. లేకుంటే లేదన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో ఏ క్షణాన ఉత్పత్తి ఆపేయాల్సి వస్తుందోనని స్టీల్‌ప్లాంట్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితి స్టీల్‌ప్లాంట్‌కు గతంలో ఎన్నడూ ఎదురవలేదు. హుద్‌హుద్‌ సమయంలో.. ఆ తర్వాత నీటికొరత వల్ల ఉత్పత్తిలో స్వల్ప బ్రేకులు పడ్డాయి. ముడి ఇనుము కొరతతో ఉత్పత్తి ఆపేయాల్సిన దుస్థితి ఇప్పుడే ఏర్పడింది.

స్టీల్‌ప్లాంట్‌పై కేకే లైన్‌ దెబ్బ..
కొండచరియలు విరిగిపడడంతో అక్టోబర్‌ 7 నుంచి కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం పర్యాటకులకంటే స్టీల్‌ప్లాంట్‌పైనే ఎక్కువగా పడింది. ప్లాంట్‌ ఆరంభం నుంచి ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీయే ఐరన్‌ ఓర్‌ను సరఫరా చేస్తోంది. కిరండోల్‌ సమీప బైలదిల్లా, బచేలి గనుల నుంచి వచ్చే ఐరన్‌ ఓర్‌ కోరాపుట్, బొర్రా, కొత్తవలసల మీదుగా స్టీల్‌ప్లాంట్‌ చేరుతుండేది. ఆ మార్గంద్వారా ప్రతిరోజూ ఐదారురేకులకుపైగా సరఫరా జరిగేది. తద్వారా స్టీల్‌ప్లాంట్‌లో ఎప్పుడూ నెలరోజుల ఉత్పత్తికి సరిపడే ఐరన్‌ ఓర్‌ నిల్వ ఉండేది. కేకేలైన్‌ ప్రమాదంతో ఈ మార్గంలో ఐరన్‌ ఓర్‌ రవాణా నిలిచిపోయింది. ఉక్కు యాజమాన్యం విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ ప్రత్యామ్నాయంగా రాయగడ, పార్వతీపురం, విజయనగరంల మీదుగా సరుకు రవాణా ప్రారంభించింది. దీంతో ఆ మార్గంలో రద్దీ మరింత పెరగడంతో రోజుకు ఒక ర్యాక్‌ రావడం గగనమైంది.

ఫలించని ప్రత్యామ్నాయ చర్యలు..
ఈ పరిస్థితిని అధిగమించేందుకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం చేసిన ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఫలించలేదు. ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌తో చర్చలు జరిపినా ఆశించిన స్థాయిలో సరుకొచ్చేలా కనిపించట్లేదు. కర్ణాటకలోని ధోనిమలై, గువా తదితర ప్రాంతాల నుంచి ఐరన్‌ ఓర్‌ సర్దుబాటుకు అధికారులు చేపట్టిన ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌ సమీపంలో ఎన్‌ఎండీసీ నిర్మిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఐరన్‌ ఓర్‌ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి. ఇప్పటికే సాంకేతిక సమస్యల కారణంగా రోజూ ఏదో బ్లాస్ట్‌లో ఉత్పత్తిని కొద్దిసేపు ఆపేస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్‌లో కృష్ణా, గోదావరి బ్లాస్ట్‌ ఫర్నేస్‌లుండగా, కొత్త ఫర్నేస్‌ ప్రారంభించి మూడేళ్లయింది. మూడు ఫర్నేస్‌లకు రోజుకు 18వేల టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా, అందుకోసం రోజుకు 27వేల టన్నుల ముడి ఇనుము కావాలి. ప్రస్తుతం 20వేల టన్నులకు మించి ముడి ఇనుము లేదు. ఇది రెండు ఫర్నేస్‌లకే సరిపోతుంది. దీంతో ఏ క్షణమైనా ఒక ఫర్నేస్‌ నుంచి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కృష్ణా ఫర్నేస్‌లో బుధవారం ఉత్పత్తి నిలిపేసినట్టుగా వచ్చిన పుకార్లను స్టీల్‌ప్లాంట్‌ వర్గాలు కొట్టిపారేశాయి. మూడు బ్లాస్ట్‌లద్వారా ఉత్పత్తి జరుగుతోందని తెలిపాయి. అయితే ఏ క్షణమైనా ఒక బ్లాస్ట్‌లో ఉత్పత్తి ఆపే అవకాశాలు లేకపోలేదన్నాయి.

బకాయిల వల్లే ఒత్తిడి తేలేకపోతోంది..
ఎన్‌ఎండీసీకి విశాఖ ఉక్కు రూ.1000 కోట్లకుపైగా బకాయి పడినట్టు తెలుస్తోంది. ఇటీవలే రూ.200 కోట్ల బకాయిలు చెల్లించింది. మిగిలిన బకాయిలూ చెల్లించాలని ఎన్‌ఎండీసీ ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ కారణంగానే సామర్థ్యానికి తగినట్టుగా ముడిఇనుము రవాణా పెంచాలని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఎన్‌ఎండీసీపై ఒత్తిడి తేలేకపోతుందన్న వాదన విన్పిస్తోంది.

మరిన్ని వార్తలు