ప్రారంభమైన విజయనగర ఉత్సవ ర్యాలీ

12 Oct, 2019 12:36 IST|Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు శనివారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు ప్రారంభించారు. ఆలయం నుంచి ర్యాలీగా ప్రారంభమైన ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. జిల్లాలోని ఆనంద గజపతి ఆడిటోరియం ఆవరణలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవ కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ కళారూపాల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, సంబంగి చిన అప్పలనాయుడు, అప్పల నరసయ్య, రాజన్న దొర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. విజయనగరం ఉత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల నిర్వహణకు పర్యాటక శాఖ నుంచి రూ.50 లక్షలు ఇస్తూ జీవో విడుదల చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యల నగరంగా విజయనగరం వర్ధిల్లుతోందన్నారు. సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక అకాడమీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్క అక్టోబర్‌ నెలలోనే వాలంటీర్ల నియామకం, ఆటో డ్రైవర్లకు చేయూత, కంటి వెలుగు, రైతు భరోసా కార్యక్రమాలు ప్రారంభించామని గుర్తు చేశారు. దీపావళికల్లా ఇసుక కొరత తీర్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు