యాచకుని దాతృత్వం

13 Feb, 2019 08:26 IST|Sakshi
రూ.60 వేలు ఆర్థిక సహకారం అందజేస్తున్న కామరాజు

శివాలయానికి రూ.60 వేలు వితరణ

చీపురుపల్లి: వృత్తి యాచన.. దాతృత్వంలో మాత్రం ఉన్నతం. ప్రస్తుత సమాజంలో ఎంతో మంది వద్ద రూ.కోట్లు ఉండొచ్చు కానీ.. దాతృత్వంలో వారు నిరుపేదలే. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శివాలయం వద్ద ఉన్న చేబ్రోలు కామరాజు అనే యాచకుడు మాత్రం దాతృత్వంలో నంబర్‌ వన్‌ అనిపించుకుంటున్నాడు. యాచన ద్వారా సంపాదించుకున్న ఒక్కో రూపాయినీ పొదుపు చేసి నీలకంఠేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అందజేస్తున్నాడు. భక్తులు ప్రదక్షిణ చేసుకునే సమయంలో ఎండ, వాన సమస్యలు ఎదురుకాకుండా షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు మంగళవారం రూ.60 వేలు అందజేశాడు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు దాదాపు రూ.3 లక్షల వరకు గుడికి సమర్పించుకున్నాడు. గతంలో ఆలయ పరిసరాల్లో షెల్టర్ల ఏర్పాటుకు రూ.1.2 లక్షలు, రూ.70 వేలు రెండు దఫాలుగా అందజేసాడు.

20 ఏళ్లుగా అక్కడే యాచన
శ్రీకాకుళం జిల్లాలోని ఒప్పంగి గ్రామానికి చెందిన కామరాజు రెండు దశాబ్దాల క్రితమే చీపురుపల్లి వచ్చేశాడు. ఇక్కడి ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద రోజూ యాచన చేస్తాడు. ఆలయం ఎదురుగా ఉన్న చిన్న పూరిగుడిసెలో నివసిస్తాడు. అలా బిచ్చమెత్తుకుని సంపాదించిన మొత్తాన్ని శివాలయం అభివృద్ధికే వెచ్చిస్తానని చెబుతున్నాడు.

మరిన్ని వార్తలు