రాష్ట్రం ముక్కలవుతున్నా..

19 Feb, 2014 02:28 IST|Sakshi

 పదవులు పట్టుకు వేలాడుతున్న కాంగ్రెస్  ప్రజాప్రతినిధులు
  మిగతా జిల్లా ప్రజాప్రతినిధుల రాజీనామాలతోనైనా కలగని చలనం
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :
 రాష్ర్ట విభజనకు ఆజ్యం పోసి, తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ నిలువునా చీల్చినా ఆ పార్టీకి చెందిన జిల్లా ప్రజాప్రతినిధుల్లో చలనం రాలేదు. అదే పార్టీకి చెందిన పక్క జిల్లాల నేతలు రాజీనామాలు చేస్తున్నా వీరికి చీమకుట్టినట్టయినాలేదు. పదవులే పరమావధిగా, ప్రజల మనోభావాల కన్నా అధికారమే తమకు అధికమని ఇంకా కుర్చీలు పట్టుకుని వేలాడుతున్నారు.  తుది వరకు పోరాడుతామని ప్రజల్ని మభ్యపెట్టి తప్పించుకున్నారు. ఆఖరి బంతి వరకు చూడండంటూ రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. నియంతృత్వ పోకడతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సోనియాగాంధీకి దాసోహమయ్యారు. లోకసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలు చేస్తున్నా జిల్లాలో ఒక్క కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ముందుకు రాలేదు. దీంతో వారి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లా నుంచి అరకు ఎంపీ వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషోర్ చంద్రదేవ్ అయితే అధిష్టానం మనిషిగా కేంద్ర కేబినెట్ పదవిని వెలగబెడుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు రాజధాని ఎక్కడని ఒకరు, అటూ ఇటూ కాని ధోరణితో మరొకరు వ్యవహరిస్తూ వచ్చారు. కొన్నాళ్లు విభజనకు అనుకూలమని, సొంత జిల్లాలో ఎదురైన చేదు అనుభవాలతో ఆ తర్వాత సమైక్యమని నాటకమాడారు. ఇంకొకరు అధిష్టానానిదే తమ నిర్ణయమని ప్రేక్షక పాత్ర పోషించారు. ఇలా ఇరువురు చెరో విధంగా జిల్లా ప్రజలతో ఆడుకున్నారు. ఒక వైపు లోక్‌సభ దద్దరిల్లిపోతున్నా వీరు కనీసం స్పందించలేదు. పూర్తిగా తమ సీట్లకే అతుక్కుపోయారు. నోరు కుట్టేసుకుని సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని చోద్యం చూస్తూ గడిపారు. వీరి తీరు చూసి జిల్లా వాసులు క్షోభించారు. ఇలాంటి ప్రతినిధులనా మనం ఎన్నుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాటకు విలువ ఇవ్వకపోయినా ఆత్మాభిమానాన్ని చంపుకొన్న  వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, బొత్స ఝాన్సీలక్ష్మీ ఇది తమకు అలవాటే అన్నట్టు వ్యవహరించారు.  
 
 ఎమ్మెల్యేలూ అంతే...    
 
 ఇక మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, వి.టి.జనార్దన్ థాట్రాజ్, సవరపు జయమణి కూడా ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. పొరుగు జిల్లా విశాఖకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు రాజీనామాలకు దిగినా జిల్లా నేతలకు చలనం రాలేదు. ప్రజలిచ్చిన పదవులను అనుభవిస్తున్నారే తప్ప ప్రజాభిష్టానికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై నా, నిరసనలు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. లోక్‌సభలో విభజన బిల్లుకు ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రి బొత్స ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని సమైక్యవాదులు మళ్లీ ఆందోళనలు చేసి, ఆస్తుల ధ్వంసానికి పాల్పడతారేమోనన్న అనుమానంతో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్త్తు ఏర్పాటు చేశారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలనూ అధికారులు తీసుకున్నారు.  
 

మరిన్ని వార్తలు