అభివృద్ధి మంత్రం...

16 Jul, 2017 05:54 IST|Sakshi

అభివృద్ధే ఆయన మంత్రం... అదే ధ్యేయంతో∙ఆయన పయనం. అక్రమాలకు ఎక్కడికక్కడ చెక్‌పెట్టి... అనుకున్న లక్ష్యాలు సాధించేందుకే ఆయన గమనం. అక్కడక్కడా అవాంతరాలు వస్తాయి... వాటిని అధిగమించాలి. వెనుకబాటు నుంచి గట్టెక్కించేందుకు సరికొత్త ఆలోచనలతో సాగాలి. అందుకోసం అందరినీ కలుపుకుని పోవాలి... అందరి ఆలోచనలకు పదును పెట్టాలి. అప్పుడే మనమేంటో పదిమందికి తెలుస్తుంది. ఈ లక్ష్యంతోనే సాగుతున్నారు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌. జిల్లా కలెక్టర్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన విజయనగరాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకు వెళ్లి తనదైన ముద్ర వేసుకోవాలని పరితపిస్తున్నారాయన. ఇంకా ఆయన మనసులోని భావా లను సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...  

2018 మార్చినాటికి సంపూర్ణ ఓడీఎఫ్‌
 2018 మార్చినాటికి జిల్లాను సంపూర్ణ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌) జిల్లాగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇటీవల 100 గంటల్లో 10వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్నాం. విజయనగరం పట్టణంలో అపారిశుద్ధ్య సమస్య తీవ్రంగానే ఉంది. నివాస ప్రాంతాల్లో కొంత వరకూ బాగానే ఉన్నా వాణిజ్య ప్రదేశాల్లో చాలా దారుణ పరిస్థితులున్నాయి. నడిరోడ్డుమీద పందులు, ఆవులు, గేదెలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది.

అందుబాటులో ఇళ్లు
హౌసింగ్‌ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఎన్టీ ఆర్‌ రూరల్, అర్భన్‌ హౌసింగ్‌ పథకాలు అమలు చేస్తున్నాం. ఏపీ టిడ్‌కో ద్వారా లే అవుట్‌ తయారు చేయిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.50 లక్షల చొప్పున రూ.3లక్షలు సబ్సిడీ ఇవ్వడంతో పాటు చిన్న ఇన్‌స్టాల్‌మెంట్‌తో మిగతా రూ.6.50లక్షలు బ్యాంకులు రుణం అందిస్తాయి. విజయనగరం, బొబ్బిలి, సాలూరులో ఈ పథకాలు అమలు చేస్తున్నాం. మూడు యూనిట్లలో యూనిట్‌ను బట్టి లబ్ధిదారుల వాటా ఉంటుంది.

ఉపాధిలో అక్రమాలను సహించం:
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌జీఎస్‌)పై ఎక్కువగా అధారపడ్డ జిల్లా మనది. సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల భవనాలు, శ్మశానాల నిర్మాణం ఈ నిధులతోనే చేపట్టేందుక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. మహిళా సమాఖ్యలకు భవనాలు మండల కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. ఉపాధి పనుల్లో అక్కడక్కడా అక్రమాలు జరుగుతున్నట్టు కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో భువన్‌ అనే పోర్టల్‌ ద్వారా జియో టాగింగ్‌ చేస్తున్నాం. ఎక్కడెక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో ఎవరైనా చూడవచ్చు. జరిగినవే మళ్లీ మళ్లీ జరుగుతుంటే గుర్తించే వెసులుబాటు ఉంది. వలసలు లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నందున గ్రామ పంచాయతీ కూడా ఈ విషయంలో పర్యవేక్షణ చేస్తుండాలి. సోషల్‌ ఆడిట్‌ కూడా పిరియాడికల్‌గా జరుగుతుంది. అక్రమాలు జరిగితే సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దు చేస్తాం. అధికారులను సస్పెండ్‌ చేస్తాం.

మరిన్ని వార్తలు