నేత్ర పరీక్షల్లో నంబర్‌ వన్‌

19 Oct, 2019 11:42 IST|Sakshi

సత్ఫలితాలనిస్తున్న వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం 

రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో విజయనగరం జిల్లా 

ఇప్పటికే 2,34,993 మంది విద్యార్థులకు పరీక్షలు పూర్తి 

జిల్లా వ్యాప్తంగా 10,909 మందికి  కంటి సమస్యలు 

అతి త్వరలోనే శస్త్ర చికిత్సలు, కళ్లద్దాల పంపిణీ  

కళాశాలల విద్యార్థులకూ నేత్ర పరీక్షలు  

సాక్షి ప్రతినిధి విజయనగరం: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. చూపు ఉంటే చక్కగా చదువుకోవచ్చు.. నచ్చిన రంగంలో రాణించవచ్చు. అన్ని పనులూ చకచకా పూర్తిచేయవచ్చు. అందుకే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నేత్ర సంరక్షణకు పెద్దపీట వేసింది. వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో నేత్ర సమస్యలను తొలగిస్తోంది. వారు చదువుకునే పాఠశాలకే వైద్యులను పంపించి పరీక్షలు చేయిస్తోంది. ఉచితంగా మందులు అందజేస్తోంది. చిన్నవయస్సులోనే కంటి సమస్యలను దూరం చేసేందుకు కృషిచేస్తోంది. తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా.. దృష్టిలోపాలను సరిదిద్దుతోంది.  వైఎస్సాఆర్‌ కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని ముందువరుసలో నిలుస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషిస్తున్నారు. పథకం సత్ఫలితాలనిస్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

పరీక్షలు ఇలా...
జిల్లాలో 3,03,819 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 2,34,993 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 77.34 శాతం పరీక్షలు పూర్తి చేసిన జిల్లాగా విజయనగరం జిల్లా రికార్డు సృష్టించింది. పరీక్షలు చేయించుకున్న విద్యార్థుల్లో 10,909కి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో సాధారణ కంటి అద్దాలు ధరించిన వారు 2,239 మంది మాత్రమే కాగా దృష్టిలోపం ఉండి కూడా అద్దాలు ధరించని వారు 1750 మంది. 9,159 మందికి కంటి అద్దాలు అవసరమని పరీక్షల్లో నిర్ధారించారు.  జిల్లాలో 3,396 పాఠశాలలు ఉండగా ఇంతవరకు 3,209 పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో నిర్ణయించారు. దీంతో జిల్లాలోని ఇంటర్‌ కళాశాలలు ప్రభుత్వ– 24, ప్రైవేటు–56, డ్రిగ్రీ ప్రభుత్వ– 6, ప్రైవేటు–16 కళాశాలల్లో చదువుతున్న సుమారు 66 వేలమంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయనున్నారు.

అందరికీ కంటి వెలుగు..  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశాల మేరకు జిల్లాలో వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. పరీక్షల అనంతరం అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్సలు, కళ్లద్దాల పంపిణీ వేగంగా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్‌ కావడానికి కంటి సమస్యలు కూడా కారణం. గిరిజన పాఠశాలల్లో ఎక్కువ మంది కంటి సమస్యల కారణంగా సబ్జెక్టుల్లో వెనకబడుతున్నారు. దీనిపై దృష్టి సారించాలని ఐటీడీఎ కొత్త పీఓకి కూడా చెప్పాం. కంటి సమస్యలతో ఏ విద్యార్థీ బాధపడకూడదు, అవకాశాలను పోగొట్టుకోకూడదన్నదే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.  
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా

వెలుగులు నింపుతున్నారు.. 
మా అమ్మాయి భీమవనం యూపీ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల కంటి పరీ క్షలు నిర్వహించారు. సమస్యలు గుర్తించి మందు లు అందజేశారు. మాలాంటి నిరుపేదల పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వెలుగులు నింపుతున్నారు.  
– తొత్తల సత్యవతి, విద్యార్థిని తల్లి, చినభీమవరం, బాడంగి   

కంటివెలుగయ్యాడు..
ముఖ్యమంత్రి జగనన్న విద్యార్థుల పాలిట కంటివెలుగయ్యాడు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలు ఒక్కొక్కటి అమలుచేస్తూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడు. కంటివెలుగు పథకంతో విద్యార్థులకు చూపు ప్రసాదిస్తున్నాడు. నేత్ర సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ఆయన మేలు మరువలేం.  
– గొంప ఉమా, రామలింగపురం, విద్యార్థి తల్లి 

చదువుకు సాయం..
పిల్లల్లో కంటి సమస్యలు పరిష్కరించడం వల్ల పిల్లలు చక్కగా చదువుకునేందుకు  అవ కాశం కలుగుతుంది. సీఎంగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే అన్నిరకాల పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారు. నేత్ర సంరక్షణకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషదగ్గ అంశం.  
– భవాని, వీబీపురం, విద్యార్థి తల్లి 

ముందు‘చూపు’  
సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ముందు చూపుతో వైఎస్సార్‌ కంటివెలుగు పథకం అమలు చేయడం ఆనందదాయకం. విద్యార్థులకు చిన్న వయస్సులోనే కంటి సమస్యలు తెలుస్తాయి. పరిష్కారమవుతాయి. మంచి కార్యక్రమం.  
– బొద్దాన దేముడు, వేపాడ ప్రాథమిక పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌    

మంచి కార్యక్రమం..
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల్లో అంధత్వ నివారణ కోసం అమలుచేసిన కం టివెలుగు కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. పైసా ఖర్చులేకుండా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సంతోషకరం. పేదలకు కంటి వెలుగు నివ్వడం దేవుడిచ్చిన వరం లాంటిది. 
– ఎలకల రాంబాబు, జోగులడుమ్మ  

నేత్ర సమస్యలకు చెక్‌..
ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల కళ్లను పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తుండడం ఆనందం గా ఉంది. చిన్నవయస్సులోనే నేత్ర సమస్యలకు చెక్‌ పెట్టేందుకు వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం అమలు చేయడం మంచి నిర్ణయం. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాం. 
– రాయగడ సూర్యశేఖర్, జియ్యమ్మవలస 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు