ఎన్నో ఆశలు... ఆకాంక్షలు

27 Feb, 2016 00:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక బడ్జెట్‌పై జిల్లా గంపెడాశలు పెట్టుకుంది. వెనుకబడిన జిల్లాగా గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని విభజన దగ్గరి నుంచి కోరుతున్న ప్రజానీకం ఆశలు ఏమేరకు నెరవేరుతాయోనని ఎదురుచూస్తోంది. రెండేళ్లుగా గిరిజన యూనివర్సిటీ కోసం ప్రకటనలు చేయడమే తప్ప మంజూరుపై ఇంతవరకు స్పష్టత లేదు. గత బడ్జెట్‌లో యూనివర్సిటీ కోసం రూ. 2కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ ఇంతవరకు దానిపై అతీగతి లేదు. ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. పాచిపెంట, బొండపల్లి, కొత్తవలస మండలాల్లో స్థలాలను పరిశీలించారు.

కొత్తవలసకే పరిశీలకులు మొగ్గు చూపారు. కానీ దాని అడుగులు ఇంతవరకు పడలేదు. ఈ బడ్జెట్‌లోనైనా దానికొక స్పష్టత వస్తుందేమోనని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల డిమాండ్ కూడా పెండింగ్‌లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు వైద్య కళాశాలతో సరిపెట్టేద్దామని యోచిస్తున్నా జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే ప్రభుత్వ వైద్య కళాశాల అవసరం ఎంతైనా ఉంది.
 
రుణ వితరణ పెరగాలి : జిల్లాలో దాదాపుగా ఉన్నది సామాన్య, మధ్య తరగతి రైతులే. బ్యాంకులు రుణమిస్తే తప్ప వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి వారిది. బ్యాం కులు రుణాలిచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. గత బకాయిలు రాకపోవడం, రాష్ర్ట ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయకపోవడం వంటి కారణాలతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. జిల్లాలో 4.29లక్షల మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రూ. 1008కోట్ల లక్ష్యం పెట్టినప్పటికీ బ్యాంకులు కొత్తగా రూ. కోటి వరకు రుణాలిచ్చాయి. మరో రూ. 629కోట్ల మేర లక్షా 40వేల మంది రైతుల రుణాలు రీషెడ్యూల్ చేశాయి. దీనివల్ల ప్రయోజనం ఆశించినంతగా లేదు. బ్యాంకులు రుణ లక్ష్యం, వితరణ పెంచేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
 
పరిశ్రమలకు ప్రోత్సాహం అవసరం :
జిల్లాలో 2,830చిన్న, మధ్య తరహా పరిశ్రమలుండగా, 35భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటితో జిల్లాలో నిరుద్యోగం తీరడం లేదు. ఉత్పత్తి సామర్ధ్యం పెరగడం లేదు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే సమస్య పరిష్కారమయ్యేది. ఇప్పుడు పరిశ్రమలకు అనుమతులు, బ్యాంకు రుణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత బడ్జెట్‌లో ప్రకటించిన పారిశ్రామిక విధానంతో జిల్లాకు ఎటువంటి మేలు జరగలేదు. ఈసారైనా స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక విధానాలను రూ పకల్పన చేయాల్సిన అవసరం ఉంది. మేకిన్ ఇండియా లో భాగంగా యువత కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
 
ఇళ్లకు మోక్షం కలగదా : గత బడ్జెట్‌లో పట్టణాల్లో ఇళ్లు నిర్మించి తీరుతామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. గ్రామాల్లో పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. జిల్లాకు మరో 3లక్షల వరకు ఇళ్లు మంజూరు కావల్సిన అవసరం ఉంది. గత బడ్జెట్‌లో జిల్లాలోని స్మార్ట్ విలేజ్‌లన్నింట్లోనూ వైఫై సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇంతవరకు ఒక్క పంచాయతీలో కూడా ఏర్పాటు చేయలేదు.

ఈ- పంచాయతీ పాలన నత్తనడకన సాగుతోంది. జిల్లాలో 490క్లస్టర్లుండగా గత బడ్జెట్‌లో 203 క్లస్టర్లలో గల పంచాయతీలను ఈ పంచాయతీలుగా మార్చుతామని వెల్లడించారు. ఇంతవరకు 91క్లస్టర్లలో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మిగతా వాటిపై అతీగతీ లేదు. వాటికి ఇప్పుడు కేటాయింపులు చేయడంతో పాటు గత బడ్జెట్‌లో పేర్కొన్న 483క్లస్టర్లపై కూడా నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు