17న తీరం దాటే అవకాశం

15 Dec, 2018 12:23 IST|Sakshi

సాక్షి, విజయనగరం: రేపు మధ్యాహ్నానికి పెథాయ్‌ తుపాను తీవ్రరూపం దాల్చే అవకాశముందని విజయనగరం ఇంచార్జ్‌ కలెక్టర్‌ వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఈనెల 17న సాయంత్రం ఒంగోలు- కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందన్నారు. గంటకు 90 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తోన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో తుపానుకు అందకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేశామని చెప్పారు.

జిల్లాలోని 34 మండలాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. సముద్రతీర మండలాలే కాకుండా ఎస్‌.కోట, సాలూరు మండలాల్లో కూడా తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామని వివరించారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, తాగునీరు, పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాలకు ఇప్పటికే వెళ్లి ప్రత్యేక అధికారులు సమీక్షిస్తున్నారని అన్నారు. హెల్ఫ్‌లైన్‌ నెంబర్లు కూడా ఏర్పాటు​చేసినట్లు తెలిపారు.

హెల్ఫ్‌లైన్‌ నెంబర్లు
08922276713(విజయనగరం కలెక్టరేట్‌)
08922276888(ఆర్డీఓ ఆఫీసు విజయనగరం)
089632207207(పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌)

మరిన్ని వార్తలు