అడుగడుగునా... ప్రభంజనం

26 Sep, 2018 07:06 IST|Sakshi
జననేత జగన్‌మోహన్‌రెడ్డితో కలసి అడుగు వేస్తున్న పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ, నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు తదితరులు

రెండో రోజు దిగ్విజయమైన ప్రజాసంకల్ప పాదయాత్ర

అడుగడుగునా జననేతను కలిసేందుకు పోటెత్తిన ప్రజలు

పారిశ్రామిక, వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వినతులు

నాడు వైఎస్సార్‌ హయాంలో ఆనందంగా ఉన్న జీవితాలు నేడు అంధకారమయ్యాయని ఆవేదన

అందరి గోడు సావధానంగా విని భరోసా ఇచ్చిన జననేత

సాక్షిప్రతినిధి, విజయనగరం/ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి బృందం: పల్లెలు పరవశించాయి. తమ అభిమాన జననేత జగన్‌మోహన్‌ రెడ్డిని చూసి మురిసిపోయాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేపడుతున్న రాజన్న తనయునికి ఆప్యాయంగా హారతులతో ఘన స్వాగతం పలికాయి. జై జగన్‌ అంటూ జగన్‌ నినాదంతో మార్మోగాయి. ‘సంక్షేమం అంటే ఎలా ఉంటుందో నీ తండ్రి పాలనలో చూశాం. ఇప్పుడు అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయాం. పేదోళ్లకు పింఛను ఇవ్వాలన్నా... పక్కా ఇళ్లు పొందాలన్నా... వాళ్ల మెప్పు పొందాలట. లేకుంటే లంచాలు ఇవ్వాలట. ఇదేమి విపరీతం అన్నా’ అంటూ తమ గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనను మనసువిప్పి చెప్పుకుని ఊరట పొందారు. జిందాల్, జూట్‌ మిల్లు కార్మికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. యువనేత ప్రకటించిన నవరత్న హామీలను లబ్ధిదారుల వేషధారణలో విద్యార్థుల ప్రదర్శనను ఏర్పాటు చేసి జగన్‌ సీఎం కావాలంటూ ఆకాంక్షించారు.

కొత్తవలస నుంచి ఎల్‌కోటకు...
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్ర 271వ రోజైన మంగళవారం కొత్తవలస మండలం నుంచి ప్రారంభమై ఎల్‌కోట మండలంలో ప్రవేశించింది. కొత్తవలస మండలం తుమ్మికాపాల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించి న జగన్‌మోహన్‌రెడ్డి అడ్డూరిపాలెం, నిమ్మపాలెం, అప్పన్నపాలెం, గాంధీనగర్, గంగుబూడి మీదుగా మల్లివీడు చేరుకుంది. అక్కడ మధ్యాహ్న భోజనానంత రం బయలుదేరి గోల్డ్‌స్టార్‌ జం క్షన్, జమ్మాదేవిపేట, రంగా పురం మీదుగా రంగరాయపురం వరకు 11.7 కిలోమీటర్ల మేర సాగింది.

వెల్లువలా ప్రజానీకం
రాత్రి బస నుంచి జగన్‌ బయలుదేరడానికి ముందే వేలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వారిని పలకరించి  పాదయాత్రను ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అభిమాన నాయకుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడగా... వారందరితో జననేత ఆత్మీయంగా చిరునవ్వులు చిందిస్తూ  సెల్ఫీలకు సహకరించారు. నిమ్మలపాలెం సమీపంలోని గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు రాపర్తి జగదీశ్‌ తో ముగ్గురు వికలాంగులు జగన్‌ వద్దకు వచ్చారు. ట్రస్ట్‌ తరఫున వారికి జగన్‌ చేతుల మీదుగా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అప్పన్నపాలెంలో యాదవ సంఘం సభ్యులు రెండు గొర్రె పిల్లలను జగన్‌కు బహూకరించారు. గంగుపూడి జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రకటించిన నవరత్నాల ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విద్యార్థులచే ఏర్పాటు చేసిన ప్రదర్శన తారసపడింది. నవరత్నాల ద్వారా లబ్ధి పొందే వారి వేషధారణలో ఉన్న చిన్నారులు నవరత్నాల విశిష్టతను విపులంగా వివరిస్తే వాటిని విన్న జననేత ఉప్పొంగిపోయారు.

కనీస వేతనాలకోసం నివేదన
జిల్లాలోని తోటపల్లి జలాశయం నుంచి విశాఖ నగరపాలక సంస్థకు తాగునీటిని అందించే పంపింగ్‌ స్కీమ్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కనీస వేతనాలు పెంచే విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరువాత తమకు తీవ్ర అన్యాయం జరిగిందని జిందాల్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో అందిన వృద్ధాప్య పింఛన్ను చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తొలగించడంతో కుటుం పోషణ కష్టతరంగా మారిందని రిక్షా కార్మికుడు అడ్డూరి అప్పారావు తమ ఆవేదనను పంచుకున్నాడు. మీ నాయన రాజన్న పుణ్యమా అని నా ఇద్దరు మనములు పెద్ద చదువులు చదువుకొని ప్రయోజకులయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుతోనే అంత పెద్ద చదువులు చదివించగలిగాం. నీ మేలు మరిచిపోలేము నాయనా అంటూ గొల్లపల్లి సన్యాసమ్మ తమకు జరిగిన మేలును జననేతకు ఆనందంగా చెప్పుకున్నారు. పాదయాత్రలో జగన్‌ వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కో ఆర్డినేటర్‌ భూమ న కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ, కడప జిల్లా రాజంపేట మాజీ ఎంపీ పి.వి.మిధున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం,  జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, విశాఖ పార్లమెంట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎం.వి.వి.సత్యనారాయణ, విశాఖ పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడు, రొంగలి జగన్నాథం, వేచలపు చినరామునాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య,  నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, శాలివాహన సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ ఎం.పురుషోత్తమరావు, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు