అన్న క్యాంటీన్‌లో...భోజనం ఇంతేనా!

12 Oct, 2018 10:12 IST|Sakshi

చాలీచాలని వడ్డింపు

ఆకలి తీరడం లేదంటున్న పేదలు

రూ.5లకు అదే ఎక్కువంటున్న నిర్వాహకులు

ఇదీ ఓట్ల జిమ్మిక్కేనా...!    

విజయనగరం రూరల్‌: తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్‌ పథకంలో ప్రజలకు చాలీచాలని భోజనం వడ్డిస్తున్నారు. కార్మికులు, రోజూ కూలీలు, పట్టణాలకు వివిధ అవసరాల మీద వచ్చే ప్రజలు ఈ క్యాంటీన్లలో భోజనం చేద్దామని వెళ్తే కడుపు నింపని భోజనంతో పథక నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 5లకే భోజనం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు వారి ఇంట్లో సొమ్ము ఏమైనా తీసుకువచ్చి పెడుతున్నారా? అని ప్రజలు మండిపడుతున్నారు. కడుపు నింపని భోజనం పెట్టే బదులు పూర్తిగా పెట్టకుండా ఉంటే బాగుంటుందని పేర్కొంటున్నారు.

విజయనగరం పట్టణంలో నెల రోజుల కిందట అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా, మున్సిపల్‌ కార్యాలయం సమీపం ప్రకాశం పార్కు వద్ద వీటిని నిర్వహిస్తున్నారు. ఘోషా ఆసుపత్రి వద్ద మరో క్యాంటీన్‌ ప్రారంభించాల్సి ఉంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం వడ్డించాల్సి ఉంటుంది.  మధ్యాహ్నం, రాత్రి భోజనంలో నాలుగు వందల గ్రాముల భోజనం వడ్డీంచాల్సి ఉండగా అతి తక్కువుగా వడ్డిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. పెరుగు 75 గ్రాములు అందించాల్సి ఉండగా మజ్జిగకు ఎక్కువ, పెరుగుకు తక్కువుగా ఉందని చెబుతున్నారు.

 ముఖ్యంగా చాలీచాలని అన్నం పెట్టి అర్థాకలితో సరిపెట్టేస్తున్నారని కార్మికులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఉదయం అంతా పనిచేసుకుని వచ్చి కప్పు అన్నం ఏమి సరిపోతుందని ప్రశ్నిస్తే మీరిచ్చే రూ.5లకు అదే ఎక్కువని సిబ్బంది కసురుకుంటున్నారని వారు వాపోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏదో చేసేస్తున్నామన్న ప్రచారం కోసమే క్యాంటీన్లు నిర్వహిస్తున్నారని ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రజల సొమ్ముతో నిర్వహించే పథకానికి కడుపునిండా అన్నం పెట్టకపోతే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. చాలీచాలని భోజనానికి గంటల తరబడి వరుస నిలబడాల్సి వస్తుందని పేద, కార్మికులు పేర్కొంటున్నారు.

నేలపైనే భోజనాలు
రోజుకు కేవలం మూడు వందల మందికే భోజనాలు అందించే అన్న క్యాంటీన్లు వద్ద భోజనం చేసేందుకు సరిపడా కుర్చీలు, బల్లలు లేకపోవడంతో భోజనం చేసేవారు నేలపై అపరిశుభ్ర వాతావరణంలో భోజనాలు చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్‌ వద్ద ఆరుబయట స్థలం ఎక్కువుగా బెంచీలు ఏర్పాటు చేసుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు