కరోనా.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌

31 Mar, 2020 18:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నాహాలు చేస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మరోవైపు సమన్వయంతో కరోనా కట్టడికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మొండికేసిన కరోనా పెషేంట్‌ను ఎలా  తీసుకురావాలి, డిసిన్ఫెక్షన్‌ ఎలా చేయాలి అన్న విషయాలపై మాక్‌ డ్రిల్‌ ఏర్పాటు చేసింది. నగరంలోని మున్సిపల్‌ స్టేడియంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాల డెమో నిర్వహించి అవగాహన కల్పించాయి. ఈ మాక్‌ డ్రిల్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ బీవీరావులు పాల్గొన్నారు.

ఈ  సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. కరోనాపై అవగాహన పెంచేందుకే ఐదు శాఖల సిబ్బందితో మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్టు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చివారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రెస్క్యూ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీవీ రావు మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రజలు ఇంటిపట్టునే ఉంటే కరోనా కట్టడి సులభతరమౌతుందన్నారు.

మరిన్ని వార్తలు