నేడు విధుల్లోకి వలంటీర్లు

15 Aug, 2019 04:20 IST|Sakshi

నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్‌ జగన్‌

విజయవాడలో 1,500 వలంటీర్లతో నేడు ముఖాముఖి

గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది, పట్టణ ప్రాంతాల్లో 73,375 మంది వలంటీర్ల నియామకం    

సాక్షి, అమరావతి: పూజ్య బాపూజీ కన్న కలలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పునకు గురువారం పునాది పడనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే ‘వలంటీర్ల’ వ్యవస్థను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో వివాదాలకు తావు లేకుండా గ్రామ, పట్టణ వార్డుల్లో 2,66,796 మంది వలంటీర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50–100 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించింది. వీరంతా గురువారం విధుల్లో చేరనున్నారు.

విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లంతా వీక్షించేలా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఎల్‌సీడీలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రామ, వార్డుల వారీగా నియమితులైన వలంటీర్లు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద, మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాల వద్ద తొలిరోజు సమావేశమవుతారు. మండల కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. విజయవాడలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 1,500 మంది వలంటీర్లు పాల్గొంటారని, వారితో సీఎం ముఖాముఖి మాట్లాడుతారని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ తెలిపారు. 

సగం మంది మహిళలే.. 
వలంటీర్ల నియామకంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2.66 లక్షల మంది వలంటీర్లలో 1.33 లక్షల పోస్టులు మహిళలకే దక్కాయి. రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎంపిక చేశారు. 

విధుల్లో చేరగానే బేస్‌లైన్‌ సర్వే 
గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది, పట్టణ ప్రాంతాల్లో 73,375 మంది వలంటీర్లు విధుల్లో చేరనున్నారు. వలంటీర్లు బాధ్యతలు చేపట్టగానే వారి ద్వారా ప్రతి కుటుంబం వివరాలను సేకరించాలని, ఈ మేరకు బేస్‌లైన్‌ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబం వారీగా ప్రతి సభ్యుడి సమగ్ర వివరాలను తెలుసుకునేలా 13 పేజీల సర్వే ప్రొఫార్మాను సిద్ధం చేసి, ఇప్పటికే జిల్లాలకు పంపినట్టు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు