-

కరోనా కట్టడికి నడుం బిగించిన వాలంటీర్లు..

24 Mar, 2020 10:10 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి/ విజయవాడ : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్చి 31వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రామ వాలంటీర్లు కూడా కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించి వారి వివరాలు వైద్య సిబ్బందికి తెలియజేస్తున్నారు. అలాగే కరోనాను ఎదుర్కొవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. సోమవారంతో పోల్చితే పోలీస్‌ సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవడంతో.. ప్రజలు బయటకు రావడం లేదు. బైక్‌పై బయటకు వచ్చేవారిని తగిన కారణం ఉంటేనే పోలీసులు రోడ్డుపైకి అనుమతిస్తున్నారు. నిత్యావసరాల కోసం బయటికి వస్తే బైక్‌పై ఒక్కరిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.  

వారికి నేడు నిబంధనలు సడలింపు : డీజీపీ
హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు మంగళవారం నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో కోర్టుకు వెళ్లే సిబ్బంది సాధ్యమైనంత మేర గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని కోరారు. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేసింది. హైకోర్టు, సచివాలయంకు మాత్రమే పరిమిత సంఖ్యలో బస్సులు నడుపుతోంది. 

మరిన్ని వార్తలు