కేంద్ర బలగాలను మోహరించండి

13 Aug, 2017 04:05 IST|Sakshi
కేంద్ర బలగాలను మోహరించండి

= పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉండాలి
= వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ ఆదేశం

కర్నూలు(అగ్రికల్చర్‌):
ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని 255 పోలింగ్‌ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నంద్యాల ఉప ఎన్నిక ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలకు వెళ్లే నాలుగు లైన్ల రహదారి పైన, చెక్‌పోస్టుల్లోనూ అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల వరుసల నిర్వహణను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్, టాయిలెట్స్, రన్నింగ్‌ వాటర్‌ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ర్యాంప్‌ ఉండాలని సూచించారు. 255 పోలింగ్‌ కేంద్రాల ఓటర్ల జాబితాలను పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇవ్వాలన్నారు. ఓటర్లందరికి ఓటరు స్లిప్‌లను అందజేయాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పోలింగ్‌ ప్రక్రియపై పాటించాల్సిన విధి విధానాలను వివరించాలన్నారు. కర్నూలు నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 255 పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ర్యాంపుల్లేని 25 పోలింగ్‌ కేంద్రాల్లో తాత్కాలికంగా నిర్మించామన్నారు.

ఓటరు స్లిప్‌ల ముద్రణ పూర్తయిందని, ఈ నెల 17 నుంచి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తామని వివరించారు. నంద్యాల నుంచి రిటర్నింగ్‌ అధికారి, జేసీ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ ఓటరు స్లిప్‌లతో పాటు ఈవీఎంల వినియోగం, వివిపిఏటీ విధానం అమలుపై ముద్రించిన కరపత్రాలు కూడా ఓటర్లకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల నియమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.25 లక్షల నగదు సీజ్‌ చేశామని వివరించారు. పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించి పత్రికలకు 7నోటీసులు, 5 కేబుల్‌ టీవీలకు నోటీసులు ఇచ్చామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించిన బడ్జెట్‌కు అదనంగా రూ.3.50 కోట్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ సీఈఓకు నివేదించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జిల్లా ఎస్పీ గోపినాథ్‌జట్టి  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు