ఓట్లు పోయాయ్‌!

6 Aug, 2018 08:12 IST|Sakshi

జిల్లాలోని కడప అసెంబ్లీ  సెగ్మెంట్‌ మొదలుకొని  అనేక నియోజకవర్గాల్లో ఓట్లు మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది.కడపలో కొంతమంది ప్రజాప్రతినిధుల కుటుంబీకుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. త్వరలో ఎన్నికల సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో  అధికారులు చైతన్యం కల్పిస్తే  ఓటుహక్కు నమోదుకు ప్రజలు కూడా ఉత్సాహం చూపుతారు. కానీ ఉన్న ఓట్లు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

సాక్షి కడప : జిల్లా కేంద్రమైన కడపలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. కడప నగర పరిధిలోని దాదాపు 50 డివిజన్ల పరిధిలో భారీ ఎత్తున ఓట్లు కనిపిం చడం లేదు. చాలాకాలంగా దీనిపై ఎన్నో కసరత్తులు చేస్తున్నా పరిస్థితి మాత్రం అంతుచిక్కడం లేదు. దాదాపు 70–80 వేల ఓట్లు గల్లంతయ్యాయి. చివరకు కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషా ఓటు సైతం ఆయనకు తెలియకుండానే డోర్‌ నంబరు మారిందంటే  పరిస్థితి  అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఒక్కసారి ప్రత్యేక దృష్టి సారిస్తే తొలగిన ఓట్లను చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొం దించవచ్చు. 100 కాదు..1000   కాదు....సుమారు 70– 80వేల మేర ఓట్లు కనిపించకుండా చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి దాదాపు 2,45,000 పైగా ఉన్న ఓట్లు ఒక్కసారిగా 1,73,000లకు  పడిపోయాయంటేనే అంతుచిక్కడం లేదు.

అంతా జంబ్లింగ్‌
కడప నియోజకవర్గంలో ఓట్లు గల్లంతైన నేపథ్యంలో ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ ఓట్లు ఎక్కడికో పోయినట్లు కనిపిస్తున్నాయి.. ఉదాహరణకు ప్రకాశ్‌నగర్లో ఉన్న ఒక వ్యక్తి ఓటు.. చిన్నచౌకు ఏరియాలో కనిపిస్తుండటం లాంటివి చెప్పుకోవచ్చు..ఇలా జంబ్లింగ్‌ అయినవి భారీగా ఉంటాయని తెలుస్తోంది. నివాసం ఉండేచోట కాకుండా  మరో చోటికి ఓట్లన్ని జంబ్లింగ్‌ పద్ధతిలో మారాయి. ఎలా మారాయన్నది కూడా అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల చేర్పునకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

మరికొన్నిచోట్ల ఇదే పరిస్థితి
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఓట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే వేల సంఖ్యలోనే మాయమయ్యాయి. బద్వేలు నియోజకవర్గంలోనూ చాలా  కనుమరుగయ్యాయి. 2 లక్షల పైచిలుకు ఓట్లున్న సెగ్మెంట్‌లో ప్రస్తుతం 1.80 లక్షలు  మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 20 వేల మేర కనిపించకుండా పోయాయి. అయితే వివిధ రకాల పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థానికత పేరుతో ఓటుకార్డు తీసుకున్నప్పటికీ ఇప్పుడు అందరూ వెళ్లిపోవడంతో ఓట్లు పోయినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. మైదుకూరు నియోజకవర్గం 1.80 లక్షలకు పైచిలుకు ఓట్లు ఉంటే ఇటీవల 9–10 వేలు మాయమయ్యాయి.  పులివెందుల నియోజకవర్గంలో కూడా రెండు లక్షలకు పైగా ఓట్లు ఉండగా, దాదాపు 4–5 వేలు   కనిపించడం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది అధికారులకే ఎరుక! జమ్మలమడుగు పరిధిలో కూడా దాదాపు మూడు వేల ఓట్ల వరకు, రాజంపేట పరిధిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైల్వేకోడూరులోనూ దాదాపు 4 వేల ఓట్లు మాయమైనట్లు తెలియవచ్చింది.
 
సర్వే చేసినా.....
కడప నగరంలో ఓట్లకు సంబంధించి సుమారు 500 మంది సిబ్బందితో అధికారులు గతంలో సర్వే చేపట్టారు. 260మంది బీఎల్‌ఓలు, మరో 250 మంది ట్యాబ్‌ ఆపరేటర్లర్లు.. 26 మంది సూపర్‌వైజర్లు.. ఇతర సిబ్బందితో కలిపి దాదాపు 500 మంది సర్వేలో పాల్గొన్నారు. అప్పట్లో కొంతమేర చేసినప్పటికీ చాలాచోట్ల డోర్‌ లాక్‌డ్, ఇతర సమస్యలు ఉత్పన్నమైనట్లు తెలిసింది.  సర్వేతో  10–20 వేలు మేర ఓట్లు  రికవరీ అయినప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. అధికారులు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టి మళ్లీ ఎన్‌రోల్‌మెంట్‌ చేస్తే తప్ప సాధ్యమయ్యే పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మళ్లీ త్వరలో అవకాశం ఉంటుంది
కడప నగరంతోపాటు అన్నిచోట్ల ఓట్ల మార్పులు, చేర్పులకు మళ్లీ అవకాశం ఉంటుందని, అప్పుడు ఓట్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని కడప ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి తెలియజేశారు.   కడప నగరంలో ఓట్లు పోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. చాలా వరకు అడ్రస్సుల మార్పు, ఆధార్‌ సీడింగ్, మనుషులు చనిపోయిన నేపథ్యంలోనే ఓట్లు పోయాయి తప్ప వేరే కారణాలు కావన్నారు. ప్రస్తుతం 1,76,000కు పైగా కడపలో ఓట్లు ఉన్నాయని  వెల్లడించారు. ఓటు కావాల్సిన వారు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి వివరాలు చెప్పినా అప్‌లోడ్‌ చేస్తారని, అంతేకాకుండా గతంలో కూడా అడ్రస్సులు, ఇతర అనేక కారణాలపై సర్వే చేయించనున్నట్లు తెలిపారు. ఎవరి ఓట్లు ప్రభుత్వ అధికారులు తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబరు 1వ తేదీన డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ జరగనుందని, మరొకసారి నిరంతరం కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తామని ఆర్డీఓ వివరించారు. పాత జాబితాలో లేని వారు నమోదు చేసుకోవచ్చన్నారు.

లోపం ఎక్కడ..
జిల్లాలో ఓట్ల మార్పులు, చేర్పుల్లో పెద్ద ఎత్తున తొలగింపు చూస్తే ఎక్కడ లోపమో అర్థం కావడం లేదు. ప్రధానంగా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా నజ్రరి నక్ష కార్యక్రమాన్ని  అమలు చేసింది. కడప నగరంలో మాత్రమే అమలు చేసినట్లు తెలియవచ్చింది.  ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కొత్త డోర్‌ నంబర్లను వేయడంతో బీఎల్‌ఓల ట్యాబుల్లో లిస్టుకు సరిపడనట్లు తెలియవచ్చింది.   దాదాపు 261 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఓట్లకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులు ఎన్ని సమాలోచనలు చేసినా మొత్తానికైతే ఓటర్ల చేర్పులు కనిపించడం లేదు. అడ్రస్సుల గల్లంతు...ఒక భవనంలో మూడంతస్తులుంటే...కేవలం ఒక భవనానికి మాత్రమే డోర్‌ నంబరు ఇవ్వడంతో పైన ఉన్న రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న ఓటర్లు జాబితా నుంచి మాయమయ్యారు. ఇలా అనేక రకాల సమస్యల వల్ల ఓట్లు తొలగిపోయాయి.   కిందిస్థాయిలో డోర్‌ టు డోర్‌ వర్క్‌ చేస్తే మళ్లీ యథావిధిగా ఓట్లు పెరిగే అవకాశం ఉంది.  ఇక్కడ పనిచేస్తున్న వారు వేరే ప్రాంతాలకు బదిలీపై వెâళ్లడం, అడ్రస్సుల మార్పు, ఆధార్‌ అనుసంధానంతో కొంతమేర తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు