ఓటరు నమోదుకు మూడు రోజులే గడువు

15 Dec, 2013 03:26 IST|Sakshi
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :ఒక్క వేటుతో చెట్టును పడగొట్టగలమో లేదో...కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో అవినీతి వక్షాన్ని కూల్చవచ్చు. ఆ ఒక్క ఆయుధం మన ఓటే కావచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్న విలువ అలాంటిది. సమసమాజ నిర్మాణం ప్రజల చేతుల్లోనే ఉంది. సచ్చీలురైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం ఇచ్చిన అద్భుతమైన కానుక ఓటుహక్కు. నవభారత నిర్మాణం కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందాల్సిందే. సమాజంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యతను యువత తెలుసుకోవాలి.  డిసెంబర్ 17వ తేదీ వరకు...
 
 నూతన ఓటర్ల నమోదుకు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. బూత్‌లెవల్ ఏజెంట్లు నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనున్నారు. 2014 జనవరి 16వ తేదీన ఓటర్ల చివరి జాబితాను ప్రచురిస్తారు. బూత్‌స్థాయి అధికారులు, తమశీల్దార్లు, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఈ-సేవా, మీ-సేవా, ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చు.
 
  18 ఏళ్లు నిండిన వారు ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి. ఓటరు(చనిపోయిన, నివా సం మారిన వారి)పేరును జాబితా నుంచి తొలగించుకోవడానికి  ఫారం-7,  జాబితాలో ఓటరు పేరు, ఫొటో, తండ్రి, భార్య, భర్త పేర్ల సవరణకు  ఫారం-8, నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరో పోలింగ్‌స్టేషన్‌కు ఓటును మారుకునేందుకు ఫారం-8ఏ ఉపయోగించాలి.
 ఈ-రిజిస్ట్రేషన్ ఈజీ... ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియపై భారీ కసరత్తు చేస్తోంది.  18 సంవత్సరాలు నిండిన విద్యార్థుల నుంచి నూతన ఓటరు దరఖాస్తులు తీసుకోవాలని జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.  అలాగే మీ-సేవ, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులను అందుబాటులో ఉంచింది.
 
 జిల్లాలో 87 వేల దరఖాస్తులు
 జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా  ఓటరు నమోదుకు 87 వేల అప్లికేషన్లు అందినట్లు జిల్లా అధికారులు తెలిపా రు. ఆదివారం(నేడు) జిల్లాలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 
 
 ఓటరు కార్డుతో ప్రయోజనాలు...
 ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవడానికి, నివాస ప్రాంతం, వయసు ధ్రువీకరణ పత్రంగా బ్యాంక్ ఖాతా తెరవడానికి, డ్రైవింగ్ లెసైన్స్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఓటరుకార్డు ఉపయోగపడుతుంది.
 
మరిన్ని వార్తలు