సర్వేల పేరుతో ఓట్ల తొలగింపు

13 Nov, 2018 13:31 IST|Sakshi
సర్వే ట్యాబ్‌ను చూపుతున్న కంగాటి శ్రీదేవి (ఇన్‌సెట్లో) ట్యాబ్‌లోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఓటర్ల వివరాలు

దొంగ సర్వేలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి

కర్నూలు, వెల్దుర్తి: జిల్లాలో కొందరు సర్వేలు చేస్తున్నామని చెబుతూ..ఓట్లను తొలగిస్తున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి సూచించారు. మండలంలో 20మంది గ్రూపులుగా విడిపోయి సోమవారం సర్వే చేస్తున్నారంటూ ఆమెకు సమచారం అందింది. దీంతో చెరుకులపాడు గ్రామంలో సర్వే చేస్తున్న ముగ్గురు యువకులను పిలిచి పూర్తిస్థాయిలో విచారణ చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఆరా తీశారు. వారి వద్ద ఏదో గ్రూప్‌ పేరుతో గల ఫోటో, పేరు, సంతకాలు లేని ఐడీలను గుర్తించారు. వారి వద్ద నున్న ట్యాబ్‌లు, ఫోన్‌లు, రికార్డులు పరిశీలించారు. సర్వే పేరుతో నియోజకవర్గంలోని ఓటర్ల వద్దకు వెళ్లి.. ఏ టీవీ చానల్‌ చూస్తున్నారు, ఏ పేపరు చదువుతున్నారు, ఏ పార్టీకి ఓటు వేస్తారు.. అని తెలుసుకుని అధికారపార్టీకి వ్యతిరేకంగా సమాచారమిచ్చిన వారి వివరాలు రికార్డులలో పొందుపరుచుకుంటున్నట్లు గుర్తించారు.

అనంతరం వారు తమ ట్యాబ్‌లలోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా వైఎస్సార్‌సీపీ ఓటర్లను తొలగిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో కంగాటి శ్రీదేవి సర్వే చేస్తున్న యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరకుని ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మండలంలో సర్వే చేసేందుకు వచ్చిన పట్టణంలోని ౖప్రైవేట్‌ లాడ్జ్‌లో తిష్టవేసిన వారందరినీ స్టేషన్‌కు తరలించి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.  ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. దొంగ సర్వేల పేరుతో వచ్చే ఎవరికైనా ప్రజలు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని కోరారు. అనుమానం వచ్చిని వారిపై పోలీసులకు, రెవన్యూ అధికారులకు సమచారం అందించాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సర్వే పట్ల అప్రమత్తమై ఉండాలన్నారు. జిల్లా అధికారులు సైతం సర్వే చేస్తున్న వారిని పూర్తిస్థాయిలో విచారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు గుంటుపల్లె జనార్దన్‌ రెడ్డి, చెర్లకొత్తూరు శేఖర్, సూదేపల్లె వెంకటేశ్వరరెడ్డి, గోవర్ధనగిరి కేశవ్, ఎల్‌ నగరం రంగడు  పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసు
సర్వే పేరుతో ఓటర్లను తొలగిస్తున్న వారిని వదిలేసి పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేశారు. తాము స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సర్వే చేస్తుండగా విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కడప జిల్లాకు చెందిన దినేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎల్‌ బండ గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, చిన్నరంగడు, చెరుకులపాడుకు చెందిన లక్ష్మన్నపై కేసు నమోదు చేయడం బట్టి చూస్తే పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు