పర్చూరులో యువత, మహిళా ఓటర్లే కీలకం

4 Apr, 2019 09:53 IST|Sakshi

పర్చూరు నియోజకవర్గంలో పెరిగిన ఓటర్లు

పురుషుల కన్నా స్త్రీలే అధికం

చేర్పుల్లో యువత ఓట్లే అధికంగా నమోదు

సాక్షి, పర్చూరు (ప్రకాశం): నియోజకవర్గ ఓటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికలకు మొత్తం 2,14,392 మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య 2019 ఎన్నికల నాటికి 2,29,742 పెరిగింది. అంటే 15,350 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన ఓట్లలో మహిళలు, యువతే కీలకం కానున్నారు. కొత్తగా నమోదైన ఓట్లు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నమోదుకు ఉత్సాహం చూపిన యువత
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా ఓట్ల నమోదు చేర్పులు, మార్పులకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి 11 నాటికి పర్చూరు నియోజకవర్గ ఓటర్లు 2,19,427 మంది ఉండగా, అందులో పురుషులు 1,07,547 మంది, స్త్రీలు 1,11,870 మంది ఉన్నారు. దీనిలో మహిళా ఓటర్లే 4,323 మంది అధికంగా ఉన్నారు. అయితే చేర్పులు, మార్పుల విషయంలో ఫాం 6, ఫాం 7కు సంబంధించి వచ్చిన దరఖాస్తులు వివాదాస్పదమయ్యాయి. ఓటర్లు తమ ఓట్లు తామే తీసేయాలంటూ వచ్చిన అర్జీలపై పునర్విచారణ జరిగింది. దీంతోపాటు మళ్లీ నూతన ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించి ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించి మార్చి 15వ తేదీ వరకూ చేర్పులకు అవకాశం కల్పించింది.

ఈ ఏడాది జనవరి 11 నుంచి మార్చి 11 వరకు 7782 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు 3020 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10,802 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 10,315 మందికి ఓటు హక్కు లభించింది. దీనిలో 18 నుంచి 25 సంవత్సరాల వయసు వారే అధికంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దీంతో ప్రస్తుతం 2019లో పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2,29,742 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,17,463 మంది మహిళలు కాగా, 1,12,269 మంది పురుషులు ఉన్నారు. అయితే వీరిలో పురుషుల కన్నా 5,194 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఇతరుల కింద మార్టూరు మండలంలో ఇద్దరు, ఇంకొల్లు మండలంలో నలుగురు, చినగంజాం మండలంలో నలుగురు చొప్పున మొత్తం 10 మంది ఇతర ఓటర్లు అంటే థర్డ్‌ జండర్లు కూడా ఉన్నారు.

నియోజకవర్గంలోని మండలాల వారీగా ప్రస్తుత ఓటర్ల వివరాలు...

మండలం మహిళా ఓటర్లు పురుష ఓటర్లు మొత్తం ఓటర్లు
మార్టూరు 29,307 28,912 58,221
యద్దనపూడి 11,526 10,313 21,839
పర్చూరు 22,138 20,856 42,994
కారంచేడు 16,934 15,998 32,932
ఇంకొల్లు 21,133 19,987  41,124 
చినగంజాం 16,425 16,203 32,632
మొత్తం ఓటర్లు 1,17,463 1,12,269 2,29,742

మండలాల వారీగా ఈ ఏడాది పెరిగిన ఓటర్లు 

మండలం పెరిగిన ఓటర్లు
మార్టూరు  3751
యద్దనపూడి 788
పర్చూరు 1548
కారంచేడు 1145
ఇంకొల్లు 1604
చినగంజాం 1479

 

 

మరిన్ని వార్తలు