కులాల లెక్క తేలింది..

20 Jun, 2019 10:59 IST|Sakshi

సామాజిక వర్గాల వారీ ఓటర్ల జాబితా విడుదల

2013తో పోల్చుకుంటే భారీగా పెరిగిన ఓటర్లు

నేడో రేపో ‘రిజర్వేషన్ల’పై విధివిధానాలు

సాక్షి, విశాఖపట్నం: స్థానిక ఎన్నికల నిర్వహణ కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌ ప్రక్రియ పూర్తికాగా..తాజాగా కులాల వారీగా ఓటర్ల గణన కూడా కొలిక్కి వచ్చింది. కులాలవారీగా ఓటర్ల గణన పూర్తి కాగా బుధవారం అధికారికంగా ప్రకటిం చారు. ఇక రిజర్వేషన్ల ఖరారుపై విధివిధానాలు ప్రకటించడమే తరువాయి. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలవు తుంది. గత నెల 20వ తేదీన ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం గ్రామీణ జిల్లా పరిధిలోని పంచాయతీ ఓటర్లు 18,02,730 మంది ఉన్నట్టుగా లెక్క తేల్చారు.

తుది జాబితా ప్రకారం 18,02,730 మంది ఓటర్లలో 9,17,654 మంది మహిళలు, 8,85,005 మంది పురుష ఓటర్లున్నారు. 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే లక్షన్నర మంది ఓటర్లు పెరిగినట్టుగా తెలుస్తోంది. నాటి ఎన్నికల్లో 15,48,800మంది ఓటర్లున్నారు. వారిలో మహిళలు 7,86,745 మంది కాగా, పురుషులు 7,62,055 మంది ఉన్నారు. గతంలో ఓటర్లతో పోల్చుకుంటే ఈసారి 2,53,930 మంది ఓటర్లు పెరిగారు. గతంతో పోల్చుకుంటే  పురుష ఓటర్లు 1,22,950 మంది పెరగగా, మహిళా ఓటర్లు 1,30,909 మంది పెరిగారు.

8.28లక్షలకు చేరిన బీసీ ఓటర్లు
వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు కులాల వారీగా ఓటర్ల విభజనపై దాదాపు నెల రోజుల పాటు కసరత్తు చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో ఎస్టీలు 4,48,374 మంది ఉన్నట్టుగా లెక్క తేలింది. వీరిలో పురుషులు 2,18,251 మంది, మహిళలు 2,30,104మంది మహిళలు, ఇతరులు 19 మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 1,25,507 మంది ఉన్నట్టుగాలెక్క తేలగా, వారిలో పురుషులు 60,764, మహిళలు 64,741 మంది, ఇతరులు ఇద్దరుఉన్నారు.ఇక బీసీలు 8,28,128 మంది ఉండగా, వారిలో పురుషులు 4,09,800 మంది, మహిళలు 4,18,295 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు.ఇక ఇతర సామాజిక వర్గాలన్నీ కలిపి మరో 4,00,721 మంది ఉండగా, వారిలో పురుషులు 1,96,190 మంది, మహిళలు 2,04,514 మంది,ఇతరులు17మంది ఉన్నారు.

భారీగా పెరిగిన ఎస్సీ, ఎస్టీ ఓటర్లు..
2013 ఎన్నికల నాటికి ఎస్టీ ఓటర్లు 3,70,531మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,82, 277 మంది కాగా, 1,88, 254 మంది మహిళా ఓటర్లున్నారు. ఇక ఎస్సీ ఓటర్లు 1,.09,523 మంది ఉండగా, వారిలో పురుషులు 53,591 మంది, మహిళా ఓటర్లు 55932 మంది ఉన్నారు. ఇక బీసీ ఓటర్లు 6,83,693 మంది ఉండగా,వారిలో 3,37,945మంది పురుషులు కాగా, 3,45, 748 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. ఇతర సామాజిక వర్గాలవారు 3,85,053  మంది కాగా, పురుషులు 188242 మంది కాగా, మహిళా ఓటర్లు 196811 మంది ఉన్నారు. 2013 ఓటర్లతో పోలిస్తే ఈసారి 77,843 మంది ఎస్టీలు, 15,984 మంది ఎస్సీ ఓటర్లు పెరగ్గా బీసీ ఓటర్లు 1,34,435 మంది పెరిగారు.

త్వరలో  రిజర్వేషన్లపై విధివిధానాలు..
ఇక మిగిలింది రిజర్వేషన్ల ఖరారుపై విధివిధానాలు రావాడమే తరువాయి. ఆ వెంటనే షెడ్యూ ల్‌ విడుదలవడం, ఎన్నికల నిర్వహణ చకచకా సాగిపోతాయి. వారం పదిరోజుల్లోనే రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం విధివిధానాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా దామాషా ప్రకారం చూస్తే జిల్లాలో ఆయా సామాజిక వర్గాల వారికి 58 శాతం మేర సీట్లు కేటాయించాల్సి ఉంది. ఏజెన్సీలోని 234 పంచా యతీలను పూర్తిగా ఎస్టీలకు కేటాయించినా, మైదాన ప్రాంతాల్లో మిగిలిన 681 పంచాయతీల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 8 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున ఓటర్ల జాబితా మేరకు సీట్లు కేటాయించాలి.

మళ్లీ ఆయా సామాజిక వర్గాల్లో సగం సీట్లు మహిళలకు ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా చూస్తే రిజర్వేషన్లు 58 శాతానికి మించిపోతున్నాయి. బీసీ రిజర్వేషన్లు కుదించకుండా రిజర్వేషన్ల ఖరారు సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ప్రమాణ స్వీకారం రోజునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాధ్యమైంత త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లబోతున్నాం.. సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్ల ఖరారుపై వచ్చే వారం మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు