సర్వే కలకలం

7 Mar, 2019 12:04 IST|Sakshi
ధర్మవరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సర్వే సిబ్బంది

 ధర్మవరంలో ఆగని ఎన్నికల సర్వేలు

అడ్డుకున్న స్థానికులపై పోలీసుల ఆగ్రహం

ధర్మవరం: రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు అలజడి సృష్టిస్తున్నాయి. ఓట్లు తొలగిస్తున్నారని, తమకు తెలియకుండా తమ పేరిటే ఫారం–7 దరఖాస్తులు నమోదవుతున్నాయని ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క గోప్యంగా ఉండాల్సిన పౌరుల ఆధార్, అకౌంటు తదితర వివరాలు ఐటీ కంపెనీల వద్దకు చేరుతున్న ఉదంతం ఆధారాలతో సహా బయటపడ్డా.. సర్వేలు మాత్రం అగడం లేదు. ఓటమి భయంతో ఉన్న అధికారపార్టీ పోలీసుల ద్వారా సర్వేరాయుళ్లకు సహకరిస్తోంది. 

ధర్మవరం నియోజకవర్గంలో ట్యాబ్‌లతో సర్వే టీంలు గ్రామ గ్రామానా పర్యటించి వివరాలు సేకరిస్తున్నాయి. ధర్మవరం పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ లాడ్జిని కేంద్రంగా చేసుకున్న ఓ సర్వే టీం నాలుగు బృందాలుగా విడిపోయి, బుధవారం ధర్మవరం మండల పరిధిలోని సీసీకొత్తకోట, నిమ్మలకుంట, పోతులనాగేపల్లి, బిల్వంపల్లి, బుడ్డారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి ఓటర్ల వివరాలను సేకరించారు. బత్తలపల్లి మండల పరిధిలోని జ్వాలాపురం, తంబాపురం గ్రామాల్లో మరో టీం సభ్యులు వివరాలను సేకరించారు. అయితే సీసీ కొత్తకోట, జ్వాలాపురం గ్రామాలకు వెళ్లిన సర్వే టీం సభ్యులకు గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. మీకు వివరాలు చెబితే.. మా ఓట్లు తీసేస్తారంటూ గ్రామస్తులు తిరగబడ్డారు. సర్వే బృందం సభ్యులను ధర్మవరం రూరల్‌ పోలీసులకు అప్పగించారు. 

రక్షణగా పోలీసులు
అయితే ప్రజల వివరాలను సేకరిస్తున్న వ్యక్తులను పోలీసులకు అప్పగిస్తే.. ‘మీదేం పోయింది.. మీకు ఇష్టం ఉంటే వివరాలు చెప్పండి.. లేకపోతే లేదు.. సర్వేలు అడ్డుకోకూడదంటూ మాకు ఆదేశాలు అందాయి.. మేమేమీ చేయలేం’ అంటూ పోలీసులు చెప్పడంతో గ్రామస్తులు నివ్వెరపోయారు. మరో సర్వే బృందం సభ్యుడు ఏకంగా పోలీస్‌ అధికారికే ఫోన్‌ చేసి, తాము సర్వే చేస్తుంటే అడ్డుకుంటున్నారు.. వీళ్లకు కాస్త గట్టిగా చెప్పండని పోలీస్‌ ఉన్నతాధికారికి చెబితే ఆయన గ్రామస్తులపై బూతుపురాణం మొదలుపెట్టి భయబ్రాంతులకు గురిచేశారు. ప్రజల వివరాలను భద్రంగా ఉంచాల్సిన అధికారులే సర్వే రాయుళ్లకు వంతపాడుతుంటంతో గ్రామస్తులు చేసేదిలేక నిమ్మకుండిపోయారు.

ఎవరూ వివరాలు చెప్పొద్దు
సర్వే పేరిట సమాచారం సేకరించే వారెవరికీ మీ వివరాలు చెప్పొద్దు. మనం చెప్పే వివరాలు కంపెనీల చేతికి చేరుతున్నాయి. ప్రభుత్వమే సర్వే చేస్తుంటే గుర్తింపు కార్డు ఇవ్వాలి కదా?.. ఊరూపేరు లేని కంపెనీలు ప్రజల వివరాలు ఎలా సేకరిస్తాయి?.. అయినా పోలీసులు.. ప్రజల వివరాలను సేకరిస్తున్న వారిని అడ్డుకోకుండా ప్రజలను బెదిరించడం ఏమిటి?..– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త

మరిన్ని వార్తలు