ప్రచార హోరు

14 Mar, 2014 02:50 IST|Sakshi

  కడప:  మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టానికి నేటితో తెర పడుతోంది. ఇప్పటి వరకు అభ్యర్థుల కసరత్తు, అసంతృప్తులు, అలకలు తీర్చేందుకు పరిమితమైన పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఇందులో అన్ని పార్టీల కంటే వైఎస్సార్‌సీపీ ముందు వరుసలో ఉంది.

ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళుతోంది. కడప కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. మేయర్ అభ్యర్థి కె.సురేష్ బాబు తనదైన  శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లతో మమేకం అవుతూ వైఎస్సార్‌సీపీ  అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గడప గడప పేరుతో ఇప్పటికే ప్రజలకు చేరువైన ఆ పార్టీ  కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు రెండో దఫా ప్రజలను కలుసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డితో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు,పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు వ్యూహలు రచించారు.  వైఎస్సార్‌సీపీ  ఆశయాలు ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావలసిన అవశ్యకతను   ప్రజల్లోకి బలంగా తీసుకుని పోతున్నారు.

పులివెందులలో వైఎస్ కుటుంబీకులు, జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో మాజీ ఎమ్మేల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాదరెడ్డి, రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బద్వేలులో డీసీ గోవిందరెడ్డి, మైదుకూరులో ఎస్. రఘరామిరెడ్డితో పాటు ముఖ్య నేతలు గెలుపు బాధ్యతలను తమ భుజ స్కంధాలపై వేసుకొని ప్రచారాన్ని ఉధృతం చేశారు.

 డీలా పడుతున్న దేశం
 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ డీలా పడుతోంది. అభ్యర్థుల ఎంపికలోనే అపసోపాలు పడిన పార్టీ ప్రచారంలోనూ ముందడుగు వేయలేక పోతోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, విభజనకు లేఖ ఇచ్చి మరీ వత్తాసు పలికారని జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

పార్టీ అభ్యర్థుల ఎంపికలో వర్గ విభేదాలు బట్టటయలు కావడంతో అందోళన నెలకొంది.కడప కార్పొరేషన్‌తోపాటు బద్వేలు, పులివెందుల, ప్రొద్దుటూరు, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగులో అభ్యర్థుల ప్రచారం ప్రారంభం కాలేదు. జనంలోకి వెళితే ఎలాంటి చేదు అనుభవం ఎదురుకోవలసి వస్తుందనో భయం అభ్యర్థులను పట్టిపీడిస్తోంది. సార్వత్రిక ఎన్నికలపై  దీని ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతూ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు దేవుడెరుగు కనీసం పరువు నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

 కుమ్మక్కు కుట్రలు

 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ  పరువు నిలుపుకునేందుకు రోజుకో ఎత్తుగడ అవలంభిస్తున్నారు. ఓట్ల వేటకు  ఆ రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. బద్వేలు, జమ్మలమడుగు, మైదుకూరులలో వైఎస్సార్‌సీపీ పోటీని తట్టుకొనేందుకు టీడీపీకి కాంగ్రెస్ స్నేహ హస్తం అందిస్తుండటంతో కుమ్మక్కు కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. మరికొన్నిచోట్ల లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని తమ ఉనికిని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు