వీఆర్‌ఏపై అత్యాచారం, హత్య 

5 Jul, 2019 03:54 IST|Sakshi

 వైఎస్సార్‌ జిల్లా యర్రబల్లి గ్రామంలో ఘటన 

అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలోనూ మృగాళ్ల దురాగతాలు 

అట్లూరు/గోకవరం (జగ్గంపేట)/అంబాజీపేట (పి.గన్నవరం)/అనంతపురం సెంట్రల్‌: మృగాళ్లు రెచ్చిపోయారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల లైంగిక దాడులకు తెగబడ్డారు. ఒక మహిళా వీఆర్‌ఏపై ఘాతుకానికి పాల్పడి హతమార్చి.. అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలికను బాధితురాలిని చేశారు. మరో రెండుచోట్ల మానసిక దివ్యాంగురాలు, మరో యువతి విధి వంచితులుగా మిగిలారు. ఈ ఘటనల్లో  వీఆర్‌ఏ మరణించగా.. కామాంధుల అరాచకాలతో చుట్టుపక్కల వారు భీతిల్లారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు మండలం అప్పరాజుపేటలో నివాసం ఉంటున్న యర్రబల్లి వీఆర్‌ఏ పోలు ఓబులమ్మ (47)పై గురువారం గుర్తు తెలి యని వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టి.. అతిపాశవికంగా ప్రాణాలు తీశారు. ఆమె చెవి కమ్మలు, ముక్కు పుడక, రూ.20 వేలు దోచుకెళ్లారు. హతురాలు ఓబులమ్మ భర్త తంభళ్లగొంది పంచాయతీ పరిధిలోని యర్రబల్లి వీఆర్‌ఏగా పనిచేస్తూ మృతి చెందారు.

కారుణ్య నియామకం కింద భర్త స్థానంలో ఓబులమ్మకు వీఆర్‌ఏగా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. గురువారం ఉదయం బద్వేలుకు వెళ్లి బ్యాంకు నుంచి రూ.20 వేలు నగదు డ్రా చేసి ఓబులమ్మ 11 గంటల సమయంలో పత్తి పంటకు నీటి తడి ఇచ్చేందుకని పొలానికి చేరుకుంది. సాయంత్రం ఐదు గంటలైనా ఇంటికి రాకపోవడంతో ఆమె కుమారుడు రాము పొలంలోకి వెళ్లాడు. మోటారు పనిచేస్తూనే ఉంది. తల్లి  కనిపించకపోవడంతో పత్తి పైరులో వెతకగా ఒంటిమీద నూ లు పోగు  లేకుండా రక్తపు గాయాలతో మృతి చెంది ఉండటాన్ని గమనించా డు. పోలీసులకు సమాచారం అం దించగా.. ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలియడంతో మండలం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలివచ్చారు.

ఐదేళ్ల బాలికపై దారుణం..
ఐదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలిక పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురంలోని కంబదూరు మండలం అండేపల్లికి చెందిన కరియన్న అలియాస్‌ కిరణ్‌ కొంతకాలం డ్రైవర్‌గా పనిచేసి ఆ తర్వాత కుల సం ఘాల్లో తిరుగుతున్నాడు. ఇతని పొరుగింట్లో నాన మ్మ సంరక్షణలో ఉన్న ఐదేళ్ల బాలికపై కన్నేసిన కిరణ్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం రాత్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 9 గంటల సమయంలో ఇంటికొచ్చిన తల్లిదండ్రులు బాలికను గమనించారు. ఏమైందోనని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అత్యాచారం జరిగినట్టు నిర్థారించారు. అనంతరం బాలికను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై ఫోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చెప్పారు. 

మానసిక దివ్యాంగురాలిపై దురాగతం 
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరానికి చెందిన మానసిక దివ్యాంగురాలు (19)పై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.  బుధవారం తల్లిదండ్రులు యువతిని స్థానికంగా ఉన్న ఎంపీయూపీ పాఠశాలకు పంపించి పొలానికి వెళ్లారు. పాఠశాల విడిచిపెట్టిన తరువాత 3.30 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన బొండు సుబ్బు అనే 24 యేళ్ల యువకుడు ‘మీ తల్లిదండ్రులు పొలంలో ఉన్నారని, వారి వద్దకు తీసుకువెళ’తానని నమ్మించి యువతిని బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న యువతిని ఇంటి ఆవరణలో విడిచి వెళ్లిపోయాడు. సాయంత్రం వచ్చిన తల్లికి జరిగిన విషయం విలపిస్తూ చెప్పడంతో గోకవరం పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా నార్త్‌జోన్‌ డీఎస్పీ  విచారణ చేపట్టారు. బాధితురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

నోట్లో గుడ్డలు కుక్కి.. 
తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం రాచపాలెంకు చెందిన ఒక యువతిపై అల్లవరానికి చెందిన కడలి శివ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శివ ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు జరిగిన విషయాన్ని బోరున విలపిస్తూ తాతయ్యకు చెప్పగా.. అప్పటికే శివ పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అంబాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని అమలాపురం రూరల్‌ సీఐ ఆర్‌.భీమరాజు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా