ఏసీబీ కలకలం

22 Dec, 2018 11:58 IST|Sakshi
దేవరపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టుబడ్డ వీఆర్వో వేణుగోపాలరావును విచారిస్తున్న ఏసీబీ అధికారులు

లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

ఆర్‌ఐకూ వాటా ఉందని వాంగ్మూలం

దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు

పశ్చిమగోదావరి, గోపాలపురం: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్వో దానిలో ఆర్‌ఐకూ వాటా ఉందని వెల్లడించడం దేవరపల్లి రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం రేపింది. దీనిపై క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కిన ఘటనలు ఉన్నాయి.   

అసలేం జరిగిందంటే..!
దేవరపల్లిలో ఒక రైతు వద్ద నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దేవరపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. త్యాజంపూడి వీఆర్వోగా పనిచేస్తున్న కొండపల్లి వేణుగోపాలరావు కొంత కాలంగా దేవరపల్లి ఇన్‌చార్జి వీఆర్వోగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తు్తన్నాడు. దేవరపల్లి శివారు కొత్తగూడెంకు చెందినరైతు పి.వెంకటేశ్వరరావు తన పొలంలో మంచినీటి బోరు వేసుకుని విద్యుత్‌ కనెక్షన్‌ అనుమతి సర్టిఫికెట్‌ కోసం 15 రోజుల క్రితం అర్జీ పెట్టుకున్నాడు. దీంతో రైతు వద్దనుంచి పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌ కార్డులు తీసుకున్న వీఆర్వో రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశాడు.  రైతు అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.13 వేలు ఇవ్వాలని పట్టుబట్టాడు.  వెంకటేశ్వరరావును 15రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. దీంతో విసిగి వేసారిన వెంకటేశ్వరరావు  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు స్ధానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతు నుంచి రూ.13 వేలు తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకుంటున్న వీఆర్వో వేణుగోపాలరావును పట్టుకున్నారు.

ఆర్‌ఐ పాత్రపై అనుమానం
ఘటనపై వీఆర్వో వేణుగోపాలరావును ప్రశ్నించగా, రూ.13 వేలల్లో రూ.పది వేలు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ) అడిగారని, దీనిలో తనకు కేవలం రూ.3వేలు మాత్రమే వాటా అని వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో అవాక్కవడం ఏసీబీ అధికారుల వంతైంది. అయితే ఆర్‌ఐ మూడు రోజులుగా సెలవులో ఉన్నట్టు తెలిసింది. ఆర్‌ఐ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఆర్‌ఐ పాత్ర ఉన్నట్టు తేలితే ఇద్దరినీ రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్పై కె. శ్రీనివాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

లంచం ఇవ్వజూపినా నేరమే
లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వజూపినా నేరమేనని, వారిపైనా కేసు నమోదు చేస్తామని ఏసీబీ డీఎస్పీ వి. గోపాలకృష్ణ చెప్పారు. దేవరపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేకరుతో మాట్లాడారు. మెట్ట ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులను ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురిచేస్తే ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇవ్వకుండా వారి పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇచ్చినట్లు విచారణలో తేలితే తీసుకున్న ఉద్యోగికి మూడేళ్ల జైలు శిక్ష, లంచం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడతాయని పేర్కొన్నారు. 

గతంలోనూ ఘటనలు
దేవరపల్లిలో గతంలోనూ ఏసీబీ దాడులు జరిగాయి. గతంలో ఇద్దరు తహసీల్దార్లు ఏసీబీకి చిక్కారు. అలాగే ఓ డెప్యూటీ తహసీల్దార్, ఓ సూపరింటెండెంట్, ఓ వీఆర్వో ఏసీబీ వలలో పడ్డారు. తాజాగా వీఆర్వో పట్టుబడి, ఆర్‌ఐ పాత్ర కూడా ఉందని చెప్పడంతో ఉద్యోగుల్లో కలకలం మొదలైంది.

మరిన్ని వార్తలు