ప్రశాంతంగా వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు

3 Feb, 2014 03:16 IST|Sakshi

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 94 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 35,608 మంది వీఆర్‌ఓ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 31,932 మంది హాజరయ్యారు. 3,676 మంది గైర్హాజరయ్యారు. 2,352 మంది వీఆర్‌ఏ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 2,045 హాజరయ్యారు. 307 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 59 మంది వికలాంగులు పరీక్షలు రాశారు. గ్రామ రెవెన్యూ అధికారుల పరీక్షలకు 89.67, గ్రామ రెవెన్యూ సహాయకుల పరీక్షలకు 86.95 శాతం హాజరైనట్లు డీఆర్వో రామిరెడ్డి వెల్లడించారు.
 
 చివరి నిమిషం వరకు ఉత్కంఠ
 జిల్లాలో జరిగిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు చివరి నిమిషం వరకు ఉత్కంఠత కలిగించాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని ఒక పక్క అధికారులు ప్రకటనలు గుప్పించినా ఫలితం లేకుండా పోయింది. ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది అభ్యర్థులు సమయానికి ఆయా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. సమయం దాటిపోవడంతో అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి నిరాకరించడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.   
 
 ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను
 అనుమతించని పోలీసులు  
 నెల్లూరు సిటీ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు సంబంధించి వివిధ కారణాలతో పలు కేంద్రాల్లో విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన వీఆర్వో పరీక్షకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషానికి చేరుకున్నప్పటికీ  గేట్లు మూసి ఉండటంతో అక్కడి సిబ్బంది, పోలీసులను బతిమలాడిన, భంగపడినా ప్రయోజనం లేకపోయింది. నగరంలో డీకే కళాశాల కేంద్రంలో ఈ పరిస్థితిని అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎదుర్కొన్నారు.
 
 నమ్ముకున్న ట్రైన్లు, బస్సులు సకాలంలో రాకపోవడం, నగరంలో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోపోవడం వంటి కారణాలతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి హాజరు కాలేకపోయారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు టంచన్‌గా 10 గంటలకు పోలీసులు గేట్లు మూసివేశారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యంగా పరుగు పరుగున వచ్చిన పలువురు అభ్యర్థులు తమ ఆలస్యానికి  గల కారణాలను ఏకరువు పెట్టినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పలువురు అభ్యర్థులు నిరాశ, నిస్పృహలతో వెనుదిరిగారు. కొందరు మహిళలు కన్నీళ్ల పర్యంతమై నిస్సహాయంగా ప్రాధేయపడటం కనిపించింది. 

మరిన్ని వార్తలు