తహసీల్దార్‌ సేవలో..టీ బాయ్‌గా వీఆర్వో!

18 Jun, 2019 12:17 IST|Sakshi

సాక్షి, ఉలవపాడు(ఒంగోలు) : ప్రజలకు సేవలు చేయాల్సిన రెవెన్యూ సిబ్బంది తమ ఉన్నతాధికారుల సేవలో నిమగ్నమైపోతున్నారు. బానిసత్వ వ్యవస్థను ఎప్పుడో రద్దు చేసినా నేటికీ పలుచోట్ల అధికారులు తమ కింది స్థాయి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పలు పనులు చేయించుకుంటూ గతంలో పోలీసు శాఖలోని ఆర్డర్లీ వ్యవస్థను జ్ఞప్తికి తెస్తున్నారు. ఉలవపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ పరిస్థితి నెలకొంది.

ఉలవపాడు వీఆర్వోగా పనిచేస్తున్న రామాంజనేయులు తహసీల్దార్‌ నగేష్‌ వచ్చిన వెంటనే బస్టాండ్‌కు వెళ్లి ఫ్లాస్క్‌లో టీ తీసుకు రావాలి. వీఆర్వోగా ప్రజలకు సేవ పనిచేయాల్సిన అధికారి టీ బాయ్‌గా అవతారమెత్తడం గమనార్హం. ఇక తహసీల్దార్‌ విధులకు కారులో వస్తారు. ఆ కారును కరేడు వీఆర్‌ఏ రామకోటేశ్వరి భర్త శ్రీను రోజూ శుభ్రం చేయాలి. రామకోటేశ్వరి బదులు విధులకు ఆమె భర్త శ్రీను హాజరై తహసీల్దార్‌ వ్యక్తిగత సేవలో తరలిస్తూ ఉంటాడు.

సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వీఆర్‌ఏ భర్త కారును శుభ్రం చేస్తూ.. వీఆర్వో టీఫ్లాస్క్‌ తెస్తూ కనిపించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్డర్లీ వ్యవస్థపై ఇటీవల స్థానికంగా పెద్ద చర్చే నడుస్తోంది. బయట చెబితే రెవెన్యూ ఉన్నతాధికారులు ఎక్కడ ఇబ్బందులు పెడతారోనని ఫొటోలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటం గమనార్హం. అటెండర్లతో టీ తెప్పించుకోవచ్చని, అలా కాకుండా ఒక అధికారితో తహసీల్దార్‌ టీ తెప్పించుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సొంత కారును కార్యాలయంలో కడిగించడం ఎంతవరకు సమంజసమని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు