విశాఖలో  మిలాన్‌ విన్యాసాలు

16 Aug, 2019 08:43 IST|Sakshi

వచ్చే మార్చిలో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహణ

పాల్గొననున్న పలు దేశాలు

ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌

అతుల్‌కుమార్‌ జైన్‌ ప్రకటన

అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూను సమర్థవంతంగా నిర్వహించి తన సత్తా చాటిన తూర్పు నావికాదళం మరోసారి అంతటి కీలకమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. పలు దేశాల నావికాదళాలు పాల్గొనే మిలాన్‌ విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ విన్యాసాలు జరగనున్నాయని తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌ జైన్‌ ప్రకటించారు. నేవీ ప్రధాన కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శత్రు దేశాలకు మన సాయుధ సంపత్తి, సైనిక బలగాల శక్తి సామర్థ్యాలు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే మిత్ర దేశాలతో అనుబంధాన్ని పటిష్ట పర్చుకోవాలన్నారు. ఈ రెండు లక్ష్యాల సాధనకు సంయుక్త విన్యాసాలు దోహదపడతాయన్నారు. ఆ లక్ష్యాలతోనే 1995లో మిలాన్‌ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో నావికాదళం నిర్వహించిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది విశాఖలో నిర్వహించే మిలాన్‌లో అంతకంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: నౌకాదళ విభాగంలో ప్రతిష్టాత్మకమైన మిలాన్‌ విన్యాసాలకు తొలిసారిగా విశాఖ వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ ప్రకటించారు. గతేడాది అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 12 దేశాలు పాల్గొన్నాయని.. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్‌సీ సమాయత్తమవుతోందన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఇండోర్‌ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎ.కె. జైన్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ ఘోర్మడే ఆధ్వర్యంలో ఆర్మ్‌డ్‌ గార్డులు, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్‌ సెక్యూరిటీ సిబ్బంది, సీ క్యాడెట్లు, వివిధ నౌకలు, సబ్‌మెరైన్ల సిబ్బంది మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. శత్రు సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం గా వ్యవహరిస్తూ సముద్ర తీరంలో నిత్యం సన్నద్ధంగా ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ జైన్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాలు పెరుగుతుండటం శుభపరిణా మమన్నారు.

ఈ బంధం మరింత బలపరచుకునేందుకు మార్చి 2020లో జరగనున్న మిలా న్‌ బహుపాక్షిక విన్యాసాలను భారత నౌకాదళం నిర్వహిస్తోందన్నారు. ఇండియన్‌ ఫ్లీట్‌ రివ్యూ తర్వాత అంతటి చరిత్రాత్మకమైన ఈవెంట్‌ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని  పిలుపునిచ్చారు. బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్‌ సీ వద్ద జనరల్‌ నేవల్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ వైస్‌ అడ్మిరల్‌ నారాయణ్‌ ప్రసాద్‌ వీరమరణం పొందిన నౌకాదళ సిబ్బందికి ఘన నివాళులర్పించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు