నియంత్రించే.. ‘యంత్రుడు’

11 Mar, 2019 10:47 IST|Sakshi

ఈసారి ఓటింగ్‌కు ‘మూడు’ యంత్రాలు 

కొత్తగా ఓటరు వెరిఫైబుల్‌ ప్యాట్‌లు అందుబాటులోకి..

వేసిన ఓటును స్వయంగా చూసుకునే వెసులుబాటు

సాక్షి, ఎడ్లపాడు: ఇప్పటి వరకు పోలింగ్‌ స్టేషన్‌లో రెండు రకాల యంత్రాలు మాత్రమే ఉండేవి. వాటిలో ఒకటి కంట్రోల్‌ యూనిట్‌ (సీయూ) యంత్రం, మరొకటి బ్యాలెట్‌ యూనిట్‌ (బీయూ) యంత్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ యంత్రాల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అదనంగా ‘ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రైల్‌’ అనే మూడో యంత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.

సింపుల్‌ వీవీ ప్యాట్‌గా పిలిచే ఈ కొత్త యంత్రంపై వినియోగం, ఉపయోగాలపై ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై మాస్టర్‌ ట్రైనీలు, ఎలక్ట్రోరల్‌ అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లోనూ శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. 

వీవీ ప్యాట్‌తో ప్రయోజనాలు...

ఎన్నికల కేంద్రంలో బ్యాలెట్‌ యూనిట్‌పై ఓటు వేయగానే తక్షణమే తాను ఏ అభ్యర్థికి ఓటు వేసింది..ఏ గుర్తు బటన్‌ నొక్కిన వివరాలు వీవీ ప్యాట్‌ యంత్రంలోని చిన్నపాటి కంప్యూటర్‌ తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమాచారం ఓటరుకు కేవలం ఏడు సెకన్ల కాలం మాత్రమే నిలుస్తుంది. ఏడు సెకన్లు పూర్తికాగానే ఆ తెరపై సమాచారం అదృశ్యమైపోతుంది. ఇలా అదృశ్యమైన సమాచారం మరుక్షణమే ఓ చిన్న కాగితంపై ముద్రణై అదే యంత్రంలోని అడుగుభాగాన ఉన్న ఖాళీ బాక్సులో పడుతుంది.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరుక్షణమే ఆ ఓటు సమాచారం పోలింగ్‌ అధికారి వద్ద ఉంటే కంట్రోల్‌ యూనిట్‌కు చేరుతుంది. గత ఎన్నికల్లో బ్యాలెట్‌ యూనిట్‌లో ఓటు వేయగానే అది కంట్రోల్‌ యూనిట్‌లోకి వెళ్లి నిక్షిప్తమయ్యేది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వీవీ ప్యాట్‌ విధులు ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ఓటరు తన ఓటుపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఏదైనా పార్టీ లేదా ఎవరైనా అభ్యర్థి ఫలానా బూత్‌లో పడిన ఓట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వీవీప్యాట్‌లో నమోదైన కాగితాల ఆధారంగా పరిశీలించే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పిస్తోంది.

ఇటీవల కాలంలో దేశంలో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు యంత్రాలతోనే పోలింగ్‌ నిర్వహించారు. ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్న వీవీప్యాట్‌ల పని తీరు, ప్రయోజనంపై ఓటర్లకు క్షేత్రస్థాయిలో అవగాహనయ్యేలా ప్రచారం, శిక్షణ ఇవ్వాలని ఎలక్ట్రోరల్‌ అధికారులకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓటింగ్‌పరంగా ఎదురయ్యే సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం క్షణాల్లో లభ్యమయ్యే అవకాశాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెస్తోంది.

మరిన్ని వార్తలు