జీతాల్లేవ్‌ !

4 May, 2018 09:31 IST|Sakshi
డీఈఓ కార్యాలయం

సీఎఫ్‌ఎంఎస్‌ విధానంతో  తీవ్ర ఇక్కట్లు

జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న వందలాది మంది టీచర్లు

మిగతా శాఖల్లోనూ ఇదే పరిస్థితి

అధికారులకు తలనొప్పిగా మారిన వైనం

మడకశిర మండలం కల్లుమరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 14 మంది టీచర్లు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరికి రెన్నెళ్లుగా మార్చి, ఏప్రిల్‌ జీతాలు నేటికీ అందలేదు. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో ఈ స్కూల్‌ హెచ్‌ఎం ఆదినారాయణరెడ్డి డీడీఓగా ఉన్నారు. ఈయనేమో ఏకంగా మూడుసార్లు స్టాఫ్‌ అందరి హెచ్‌ఆర్‌ వివరాలు ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. కానీ ఇప్పటిదాకా వారికి జీతాలు మాత్రం అందలేదు. ట్రెజరీ కార్యాలయంలో విచారిస్తే సర్వర్‌ స్లోగా ఉందంటూ సమాధానం చెబుతున్నారు. జీతాల విషయమై స్టాఫ్‌ హెచ్‌ఎంతో గొడవ పడుతున్నారు. జీతాలు రాకపోయే సరికి నెలానెలా కట్టాల్సిన వ్యక్తిగత రుణాలు, ఇతరత్రా అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఖజానా శాఖలో నూతన విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. మొన్నటి దాకా ప్రతినెలా ఒకటో తేదీ టంచనుగా జీతాలు అందుతుండగా రెన్నెళ్లుగా ఆలస్యమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 34,900 మంది ఉండగా, టీచర్లు 16,300 మంది దాకా ఉన్నారు. జీతాల చెల్లింపులో సాంకేతికను ప్రవేశపెట్టి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ‘సమగ్ర ఆర్థిక చెల్లింపుల వ్యవస్థ’ సీఎఫ్‌ఎంఎస్‌ను  తీసుకొచ్చింది. దీనిపై డ్రాయింగ్‌ అధికారులకు (డీడీఓ) సరైన అవగాహన లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వేదికగా రాజధానిలో కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వేలాదిమంది ఉద్యోగ, ఉపాధ్యాయుల వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లోకి మార్చాల్సి ఉంది. ఈ మార్పులు చేసేందుకు కొత్త సర్వర్‌ సరిగా పని చేయడం లేదు. వివరాలు మార్పుచేసి బిల్లులు పెట్టాలంటే సమయం చాలా పడుతుందని డీడీఓలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

విద్యాశాఖ ఒక్కటే కాదు దాదాపు అన్ని శాఖల ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. అయితే ఎక్కువమంది ఉద్యోగులున్న విద్యాశాఖలో ఈ గందరగోళం మరింత ఎక్కువగా ఉంది. మరోవైపు కొత్త విధానంపై అవగాహన లేకపోవడం ఓ సమస్య అయితే సమస్యల పరిష్కారానికి రాజధానిలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని డీడీఓలు వాపోతున్నారు. సర్వర్‌ పని చేయకపోవడం, వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు ఎదరువుతున్న సాంకేతిక పరమైన ఇబ్బందులపై కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వారి నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కొత్త విధానాన్ని అమలు చేసే ముందు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉన్నఫళంగా అమలు చేయడంతోనే సమస్య తలెత్తుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

మార్చి నెల జీతాలందలేదు
సీఎఫ్‌ఎంఎస్‌ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  డీడీఓలకు అవగాహన కల్పించకపోవడం సమస్యగా మారింది.  జిల్లాలో దాదాపు 100 పాఠశాలల ఉపాధ్యాయులకు మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందలేదు.  ఉన్నతాధికారులు స్పందించి సీఎఫ్‌ఎంఎస్‌ విధానంపై స్పష్టమైన అవగాహన కల్పించాలి.       – పి.అశోక్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు