విద్యుత్‌శాఖలో ఆకలి కేకలు

21 Dec, 2018 07:12 IST|Sakshi
దాసన్నపేటలోని విద్యుత్‌ భవనం

మూడు నెలలుగా జీతాలకు నోచుకోని కంప్యూటర్‌ ఆపరేటర్లు

ఏజెన్సీ మార్పు పేరిట నిర్లక్ష్యం నటిస్తున్న అధికారులు

ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 32 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు

విజయనగరం మున్సిపాలిటీ: విద్యుత్‌ శాఖలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చేసిన పనికి జీతాలు అందక అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 6,49,405 సర్వీసులకు సేవలందించడంలో తమ వంతు పాత్రపోషిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు మూడు నెలలుగా జీతాలు అందడంలేదు. ప్రశ్నిస్తే విధుల నుంచి తొలగిస్తారన్న భయంతో ఎవ్వరికీ చెప్పుకోలేక ఆత్మక్షోభ అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కాలంగడుపుతున్నారు. మరో నాలుగు రోజుల వ్యవధిలో ప్రారంభం కానున్న వరుస పండుగల నేపథ్యంలో ఈ నెలైనా జీతాలు అందుతాయో లేదో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇదీ పరిస్థితి...
ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషషన్‌ సర్కిల్‌ పరిధిలోని మూడు డివిజన్‌లలో 32 మంది కంప్యూటర్‌ ఆపరేటర్‌లు అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వి«ధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ సంస్థపరిధిలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఏజేన్సీ నుంచి ప్రతి నెలా జీతాలు చెల్లిస్తుంటారు. అయితే, అక్టోబర్‌ నుంచి జీతాలు రాకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. సకాలంలో జీతాలు రాకున్నా ఉన్న ఉద్యోగాన్ని వదులకోలేక విధుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం తాజా నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు సంస్థ పరిధిలో ఒకే ఏజెన్సీ కింద పనిచేసిన కంప్యూటర్‌ ఆపరేటర్లను జిల్లాల వారీగా ఏజెన్సీలకు అప్పగించారు. అంతేకాకుండా నవంబర్‌ నుంచి అన్ని డిస్కం, ట్రాన్స్‌కో సంస్థల పరిధిలో విధులు నిర్వహిస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పాటు వీరికి జీతాలు పెంచారు. ఈ లెక్కన అక్టోబర్‌ నెలకు రూ.11,200తో పాటు నవంబర్‌ నుంచి పెంచిన వేతనం రూ.18,300 రావాల్సి ఉంది. మరో పది రోజుల వ్యవధిలో డిసెంబర్‌ నెల ముగియనుండటంతో మూడు నెలలు పూర్తి కావస్తోంది. దీంతో 32 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు జీతలు లేక, కుటుంబ షోషణ కోసం ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించింది.

సమస్య ఎక్కడంటే..
అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు ప్రతీనెలా ఏపీఈపీడీసీఎల్‌ సంస్థ పరిధిలో ఉన్న ఓ ఏజెన్సీ ద్వారా అందించేవారు. అయితే, పాలనాపరమైన సౌలభ్యం మేరకు ఈ విధానాన్ని మార్పు చేస్తూ సర్కిల్‌ పరిధిలో ఏజెన్సీలకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో  సర్కిల్‌లోని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సదరు ఏజెన్సీ ద్వారా కంప్యూటర్‌ ఆపరేటర్‌లకు జీతాలు చెల్లింపులు జరిగేలా చూడాల్సి ఉంది. అయితే, గడిచిన మూడు నెలల కాలంలో సంభవించిన తిత్లీ, పెథాయ్‌ తుపానులు కారణాలుగా చెబుతూ ఈ ప్రక్రియను నిర్వహించడం లేదు. దీంతో  అవుట్‌ సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు జీతాలకు నోచుకోవడం లేదు. ఇదే సమస్యను పలుమార్లు విశాఖలో ఉన్న  ఏపీఈపీడీసీఎల్‌ సంస్థ కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పట్టించుకోవటం లేదని , కార్పొరేట్‌ కార్యాలయానికి వెళ్తే సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లి అడగాలంటూ కుంటి సాకులు చెప్పుకుంటూ వస్తున్నారని వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ వై.విష్ణు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. సెక్షన్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహించే కంప్యూటర్‌ ఆపరేటర్లకు జీతాలు అందకపోవడంతో టెండర్లలో జాప్యం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఏ ఒక్కరు తన దృష్టికి ఈ సమస్యను తీసుకురాలేదని, టెండర్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బకాయి జీతాలు కలిపి చెల్లించేస్తామన్నారు.

మరిన్ని వార్తలు