వారం ఆగండి

24 Jan, 2014 03:48 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: హస్తం నీడ నుంచి సైకిలెక్కేందుకు సర్వం సిద్ధం చేసుకుని ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డిలకు సీఎం కిరణ్ మరో వారం ఆగాలని సూచించారు.  కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న సీఎం ఎలాగైనా ఆదాలను తన వైపు నిలుపుకునే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం కూడా లేక పోలేదని సీఎం చూచాయగా వెల్లడించినట్టు తెలిసింది.
 
 రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రావని సీమాంధ్రలోని అనేక మంది  ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా దృఢ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి జాబితాలోనే ఉన్న జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొదటి చూపు చూశారు. జిల్లాలో సమీకరణల దృష్ట్యా అక్కడ వారికి బెర్త్‌లు దక్కే అవకాశాలు కనిపించలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు. టీడీపీలో కీలక నాయకుడైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు మరికొందరు నేతల ద్వారా వారు తెలుగుదేశం చెంతకు చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
 
 వీరి ఆగమనాన్ని టీడీపీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నా ఆర్థిక, రాజకీయ బలం దృష్ట్యా చంద్రబాబు నాయుడు వీరికి ఎల్లో కార్పెట్ స్వాగతం పలికేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. గురువారంతో శాసనసభలో తెలంగాణ బిల్లు మీద చర్చ ముగిసిన వెంటనే నెలాఖరులోపు సైకిలెక్కేందుకు ఎమ్మెల్యేలిద్దరూ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో తమకు గల వ్యక్తిగత సంబంధాల రీత్యా ఎప్పటి నుంచో వీరు తాము పార్టీని వీడక తప్పదనే నిర్ణయాన్ని ఆయన ముందు వెల్లడిస్తున్నారు. తన మనసులో ఏముందనే విషయాన్ని కుటుంబ సభ్యులతో సైతం బయట పెట్టని మనస్తత్వం కలిగిన సీఎం కిరణ్  ఈనెల 23వ తేదీ గురువారం వరకు వీరిని కాంగ్రెస్‌లోనే కొనసాగేలా చేయగలిగారు.
 
 23వ తేదీ తర్వాత అంతా కలసి నిర్ణయం తీసుకుందామని వారికి నచ్చచెప్పారు. సీఎం విధించిన గడువు ముగియడంతో గురువారం వీరు ఆయన్ను కలసి తమ అభిమతం వెల్లడించినట్టు తెలిసింది. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాష్ట్రపతి మరో వారం రోజులు గడువు  ఇచ్చినందువల్ల ఈ నెల 30వ తేదీ వరకు టీడీపీలో చేరే నిర్ణయం వాయిదా వేసుకోవాలని సీఎం వారికి సూచిం చారని సమాచారం. 30వ తేదీ తర్వాత రాష్ర్టంలో అనూహ్య రాజకీయ మార్పులు జరుగుతాయని, అంతా కలసి నిర్ణయం తీసుకుందామని సీఎం వారిని సముదాయించినట్టు తెలిసింది.
 
 ఆదాలను ఆపుకునే యోచన?
 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి  కొత్త పార్టీ పెడతారనే విషయం కళ్లకు కడుతున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డిని తన వైపు నిలుపుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రికి సన్నిహితులైన నాయకులు అంచనా వేస్తున్నారు.
 
 కొత్త పార్టీ గురించి ఆయన నేరుగా చెప్పక పోయినా తనకు కావాలనుకుంటున్న మనుషుల వద్ద ‘కొన్ని రోజులు ఆగండి. ఏమైనా జరగొచ్చు’ అంటూ పరోక్ష ంగా కొత్త పార్టీ విషయాన్ని వివరిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో కాంగ్రెస్‌కు కీలక నేతలుగా వ్యవహరిస్తున్న ఆనం బ్రదర్స్ తన పార్టీలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆదాలను తన వైపు తిప్పుకోవాలని సీఎం యోచిస్తున్నట్టు సమాచారం. కొత్త పార్టీ పెడితే జిల్లాలో ఆ పార్టీకి చెందిన బాధ్యతలు ఆదాలకు అప్పగించాలనే యోచనతోనే సీఎం ఆయన్ను పార్టీ వీడి వెళ్లకుండా బుజ్జగిస్తున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  
 

మరిన్ని వార్తలు