రుణ మాఫీ... తలనొప్పి!

7 Jul, 2014 00:47 IST|Sakshi
  • ఏదీ తేల్చని టీడీపీ ప్రభుత్వం
  •  పీఏసీఎస్‌ల్లో నిలిచిపోయిన లావాదేవీలు
  •  ఐదు నెలలుగా జీతాలందని సిబ్బంది
  •  ఆర్థిక ఇబ్బందులతో లబోదిబోమంటున్న వైనం
  •  స్పందించని డీసీసీబీ, ప్రభుత్వం
  • తుమ్మపాల : ‘ఎంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చింది’ అన్న చందంగా తయారయింది ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) పరిస్థితి. ఓట్ల గేలంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీ పీఏసీఎస్ ఉద్యోగులకు జీతాల్లేకుండా చేసింది. ప్రభుత్వం రుణాన్ని మాఫీ చేస్తుందన్న ఉద్దేశంతో రైతులెవరూ బకాయిలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో చాలా పీఏసీఎస్‌ల్లో ఐదు నెలల నుంచి జీతాల చెల్లింపు కూడా నిలిచిపోయింది.

    మాఫీపై ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండడం, స్పష్టమైన వైఖరి లేకుండా దాటవేత యత్నాలు చేస్తుండడం, పూటకో ప్రకటనతో గందరగోళానికి గురి చేస్తుండడంతో అసలు మాఫీ అవుతుందో లేదో అన్న బెంగ రైతుల్ని వేధిస్తోంది. కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం కూడా వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు సహకార సంఘాలు కూడా ఇదే సందిగ్ధంతో కొనసాగుతున్నాయి.

    రుణాలపై వచ్చే వడ్డీపైనే పీఏసీఎస్‌ల మనుగడ ఆధారపడి ఉంది. బకాయిలు వసూలు మేరకే సిబ్బందికి జీతాభత్యాల చెల్లింపు ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. మాఫీ హామీ ప్రకటన నుంచే బకాయిలు వసూలు గణనీయంగా తగ్గిపోయింది. ‘ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అసలు లావాదేవీలే లేవు. సంఘాల మెట్లెక్కే రైతు కనిపించడం లేదు. సిబ్బంది వసూలు వెళితే ముఖాలు చాటేస్తున్నారు.

    ఇక మాకు జీతాలు వస్తాయన్న నమ్మకం లేదు’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. ఫిబ్రవరి నుంచి రైతులకు జీతాలు అందడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే నెలరోజులు గడిచిపోయింది. ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఈనెల కూడా జీతాలు అందే పరిస్థితి లేదని సిబ్బంది వాపోతున్నారు. ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో నానాపాట్లు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    కొన్నిచోట్లే...
    జిల్లాలో 98 పీఏసీఎస్‌లున్నాయి. వీటిలో 78 పీఏసీఎస్‌ల్లో సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. దీంతో దాదాపు 250 మంది ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందిగా తయారయింది. మిగిలిన 20 పీఏసీఎస్‌ల్లో బంగారంపై రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు బాగుండడం, పరపతి, పరపతేతర సేవలు అందిస్తుండడంతో సిబ్బంది జీతాలకు ఢోకాలేకుండా పోయింది.

    అనకాపల్లి మండలంలోని తుమ్మపాల పీఏసీఎస్ సిబ్బందికి జీతాలందుతుండగా, సిహెచ్.ఎన్.అగ్రహారం సిబ్బందికి జీతాలు లేవు. ‘గతంలో ఆర్థిక ఇబ్బందులున్న సొసైటీలకు ఒక శాతం వడ్డీకి కేంద్ర బ్యాంకు రుణాలు ఇచ్చేది. వసూళ్లు జరిగాక రికవరీ చేసుకునేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సొసైటీ తీర్మానం చేస్తే ఐదు శాతం వడ్డీపై మాత్రమే ఇస్తున్నారు’ అని ఉద్యోగులు వాపోతున్నారు.  

    మూడు నాలుగు నెలల నుంచి డీసీసీబీ కార్యాలయం చుట్టూ జీతాల కోసం ప్రదక్షిణ చేస్తున్నా ఇదిగో అదిగో అనడమే తప్ప స్పష్టతలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. దీంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
     
    పీఎఫ్ నిధులూ హుళక్కి
    జీతాల్లేక పోవడంతో పీఎఫ్ ఖాతాలకు నిధులు జమ చేయడం లేదు. దీంతో పదవీ విరమణ పొందిన, మృతి చెందిన ఉద్యోగులకు పింఛన్, ఇతర సౌకర్యాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా ఐదో తేదీలోగా పీఎఫ్ బకాయి చెల్లించాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
     
     ఐదు నెలలైంది
     ఐదు నెలలుగా జీతం అందలేదు. బ్యాంకులో లావాదేవీలు నిలిచిపోవడంతో ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. దీంతో జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం, డీసీసీబీ అధికారులు స్పందించి జీతాలు చెల్లించాలి.
     - సిహెచ్.మధుసూదనరావు, కార్యదర్శి, సిహెచ్.ఎన్.అగ్రహారం పీఏసీఎస్
     
     ఉద్యమం తప్పదు
     ప్రభుత్వం, డీసీసీబీ స్పందించి 20 రోజుల్లోగా పీఏసీఎస్‌ల సిబ్బందికి జీతాలు చెల్లించకుంటే ఉద్యమం చేపడతాం. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశంలో పీఏసీఎస్ ఉద్యోగుల జీతాల విషయమై చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం. అవసరమైతే జీతాలు చెల్లించే వరకు ఉద్యమిస్తాం.
     - పి.నాగభూషణం, సహకార సంఘాల యూనియన్ జిల్లా అధ్యక్షుడు
     

మరిన్ని వార్తలు