నడిసంద్రంపై నడక!

8 Mar, 2017 04:30 IST|Sakshi

నడిసంద్రంపై నడక! వినడానికి వింతగా ఉంది కదా! వింత కాదు.. విచిత్రం అంతకంటే కాదు. పొట్టకూటి కోసం ఎంచుకున్న వృత్తి ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. సుదూరం నుంచి చూసే వారికే కలవరానికి గురిచేస్తోంది. సముద్రంలో పేరుకుపోయిన ఇసుకను ఒడ్డుకు పంప్‌ చేసే డ్రెడ్జింగ్‌ ప్రక్రియ విశాఖ సాగరతీరం ఆర్కే బీచ్‌ సమీపంలో కొద్దిరోజులుగా సాగుతోంది. డ్రెడ్జింగ్‌ చేసే ఓడ నుంచి భారీ పైప్‌లైన్‌ను తీరానికి వేశారు. ఆ పైప్‌లైన్‌లో ఇసుక కూరుకుపోయి పనులకు అంతరాయం ఏర్పడింది.

కూరుకుపోయిన ఇసుకను తొలగించి, పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయడానికి అందులో నిష్ణాతులైన వారితో పాటు కొంతమంది మత్స్యకారులను ఓ చిన్న బోటుపై డ్రెడ్జింగ్‌ నౌక వద్దకు పంపారు. వారు ఉప్పొంగే అలల నడుమ ఉన్న పైప్‌లైన్‌పై పలుమార్లు వెనక్కి, ముందుకు నడుస్తూ, బ్యాలెన్స్‌ చేసుకుంటూ ప్రాణాలొడ్డి మరమ్మతు పనులు చేపడుతున్నారు.

ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పినా సముద్రం పాలవ్వాల్సిందే. ఈ సాహస ప్రక్రియ చూసే వారికి ఆశ్చర్యం గొలుపుతోంది. దూరం నుంచి వీక్షించే వారికి వారు సాగరంపై నడుస్తున్నారన్న భావన కలుగుతోంది. సహజ సౌందర్యంతో నిత్యం వేలాది మందిని ఆకర్షిస్తున్న ఆర్కే బీచ్‌ ఈ అద్భుత దృశ్యాన్ని కూడా అదనంగా అందజేస్తోంది.  
 – సాక్షి, విశాఖపట్నం

మరిన్ని వార్తలు