వాల్తేరు ఉద్యోగుల్లో కలవరం

26 Aug, 2019 06:20 IST|Sakshi
వాల్తేరు డివిజన్‌ డీఆర్‌ఎం కార్యాలయం

డివిజన్‌ విభజన నేపథ్యంలోభవితవ్యంపై ఆందోళన

 పదోన్నతులు కోల్పోనున్న సీనియర్లు

ఏ జోన్‌లో వేస్తారన్న ఉత్కంఠ

పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి

వాల్తేరు డివిజన్‌ విభజన దాదాపుగా ఖరారైపోతోంది. ఉద్యోగ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా.. రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం విభజన ప్రక్రియ ఒక్కో అడుగు వేస్తోంది. దీంతో వాల్తేరు డివిజన్‌ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు డివిజన్‌ రెండుగా చీలుతున్న నేపథ్యంలో తమ భవితవ్యం ఏమైపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, విశాఖపట్నం: రైల్వే జోన్‌ సాధించామన్న ఆనందం కంటే.. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ కోల్పోతున్నామన్న బాధ ప్రతి ఒక్కరినీ కలవరపరుస్తోంది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను విభజించి విశాఖ జోన్‌ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. డివిజన్‌ విభజించేందుకు అవసరమైన వ్యవస్థ కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. వాల్తేరు డివిజన్‌ విభజన చేస్తూ ఇదే సమయంలో రాయగడ డివిజన్‌ ఏర్పాటు, నిర్వహణకు సంబం«ధించిన విధివిధానాలు రూపొందించాలంటూ తూర్పు కోస్తా ప్రధాన కార్యాలయ జనరల్‌ మేనేజర్‌ను రైల్వే బోర్డు ఆదేశించింది. అదే విధంగా రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్‌కు సంబంధించిన విధివిధానాలు రూపొందించేలా ఒక నోడల్‌ అధికారిని నియమించారు. ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది.

ఎక్కడ పనిచెయ్యాలి?
దశాబ్దానికి పైగా చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌లో 18,760 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. జోన్‌ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాల్తేరు డివిజన్‌ను రెండుగా చీల్చేస్తున్నారు. కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్‌లోనూ.. మిగిలిన భాగాన్ని విజయవాడ డివిజన్‌ లోనూ కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు పూర్తిగా కనుమరుగు కాబోతోంది. దీంతో వాల్తేరు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ డివిజన్‌ కిందికి వస్తారన్న విషయంపై ఇంకా సందిగ్థత నెలకొంది. రెండింటిలో ఏ డివిజన్‌కు పంపిస్తారన్న దానిపై ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.

విభజన పాపం.. పదోన్నతులకు శాపం!
విభజన కారణంగా ఉద్యోగుల కొత్త డివిజన్‌లో పని చేయాల్సి రావడం ఒక ఎత్తయితే.. దీని కారణంగా పదోన్నతులకు దూరం కానుండటం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. ఎన్నో ఏళ్లుగా డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు.. కొత్త డివిజన్‌కు మారిపోతే, వారి సీనియారిటీ ఏమైపోతుందోనని సతమతమవుతున్నారు. కలాసీలు, ట్రాక్‌మెన్లు, టెక్నీషియన్లుగా ఉద్యోగంలో చేరిన వారు.. డివిజన్‌ విడిపోతే జీవిత కాలం ప్రమోషన్ల కోసం పాకులాడాల్సిందే. కలాసీలకు ప్రమోషన్‌ వస్తే.. రూ.100 మాత్రమే జీతం పెరిగినా.. దాని కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారు వాల్తేరు డివిజన్‌లో వందల మంది ఉన్నారు. అదే విధంగా మూడేళ్లకు పైగా సర్వీస్‌ చేసిన సుమారు 300 మంది గ్యాంగ్‌మెన్‌లు జేఈలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. టెక్నీషియన్లంతా డివిజనల్‌ సీనియారిటీ కోసం గ్రూప్‌–డి ఉద్యోగులంతా యూనిట్‌ సీనియారిటీని కోల్పోయే ప్రమాదముంది.

క్లర్క్‌ పదోన్నతుల్లో అసమానతలు...!
మరోవైపు ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌ ఉద్యోగుల పదోన్నతుల్లో అసమానతలు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంగా చాలా నష్టపోయిన క్లర్క్‌లు ఈ ఏడాదైనా ప్రమోషన్‌ వస్తుందని ఆశించారు. అయితే డివిజన్‌ విడగొడుతున్నారన్న నేపథ్యంలో మరింత కుంగుబాటుకు గురవుతున్నారు. ఒకేసారి విధుల్లో జాయిన్‌ అయినా కొంతమందికి ప్రమోషన్లు రావడం.. మరికొందరికి 15 నుంచి 20 ఏళ్లు దాటినా ఒక్క ప్రమోషన్‌ కూడా ఇవ్వకపోవడంపై నిరుత్సాహంగా ఉన్నారు. ఇంటర్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రమోషన్లు కూడా అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. రేపు కొత్త డివిజన్‌కు వెళ్లాక ప్రమోషన్‌ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచిచూడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం..
డివిజన్‌ విడిపోతే.. వాల్తేరు పరిధిలో ఉన్నవారంతా ఏ చిన్న పనికోసమైనా విజయవాడ డివిజన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు డివిజన్‌లో ఉన్న ప్రధాన ఆదాయ వనరులు కూడా వేరే జోన్‌కి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. పదోన్నతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంపైనే ఎక్కువగా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
– ఎస్‌.రామచంద్రరావు, రైల్వే యూనియన్‌ నాయకుడు

గ్రూప్‌–సీ,డీ సిబ్బందికి  న్యాయం చేయాలి..
వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ప్రమోషన్‌ పోస్టులన్నీ తక్షణమే భర్తీ చెయ్యాలి. దశాబ్దాలుగా ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్న గ్రూప్‌–సీ, గ్రూప్‌–డీ ఉద్యోగులకు న్యాయం చెయ్యాలి. ఉన్నపళంగా డివిజన్‌ విడిపోతే సి బ్బంది తీవ్రంగా నష్టపోతారు. డివిజన్‌ విడగొ ట్టకూడదని కోరుతున్నాం.
– భాస్కర్‌ రావు, యూనియన్‌ జోనల్‌ ప్రతినిధి

సిబ్బందికి న్యాయం చెయ్యాలి
డివిజన్‌ విడిపోదని భావిస్తున్నాం. ఒకవేళ ఏ కారణం చేతనైనా డివిజన్‌ విడిపోతే ఇక్కడి సిబ్బంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొత్త జోన్, కొత్త డివిజన్‌ విధానం పూర్తయ్యేలోపు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంటర్‌ డిపార్ట్‌మెంట్‌ ఛేంజ్‌ విధానాన్ని 25, 33, 70 శాతం కోటా విధానంగా యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.
–డా. పెదిరెడ్ల రాజశేఖర్, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అదనపు ప్రధాన కార్యదర్శి 

మరిన్ని వార్తలు