ఎన్నాళ్లీ ఎదురుచూపులు?

10 May, 2018 12:52 IST|Sakshi
నిరాశలో బాధితులు

ఆరు నెలలవుతున్నా కొలిక్కిరాని   ట్రేడ్‌ బ్రోకర్‌ ఆస్తుల కేసు

నిరాశలో బాధితులు మందగమనంలో కేసు

శ్రీకాకుళం, రాజాం : సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్‌ బ్రోకర్‌ టంకాల శ్రీరామ్‌ ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడి ఆరు నెలలు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదు. నాలుగేళ్ల పాటు అటు రాజాం, ఇటు సంతకవిటి మండలంలోని తాలాడ వద్ద కార్యాలయాలు ప్రారంభించి షేర్లు పేరుతో భారీగా పెట్టుబడులు రాబట్టిన శ్రీరామ్‌ తర్వాత పరారై పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది నవంబర్‌ 10న ఈ ఘటన జరగ్గా, నేటికి ఆరునెలలు కావస్తోంది. ఆరంభంలో చకచకా కేసును కొలిక్కితీసుకొచ్చిన పోలీసులు మొదటి చార్జీ షీటులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు కూడా అప్పగించారు. వారంతా మూడు నెలుల జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అక్కడితో స్థానిక పోలీసులు కేసు ముగించగా, ఈ ఏడాది జనవరిలో విశాఖ సీఐడీ పోలీసులు కేసును తమచేతిలోకి తీసుకున్నారు. జనవరిలో హడావుడి చేసిన సీఐడీ పోలీసులు నాలుగునెలుల ముగిసినా కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతి విషయాలు అటు మీడియా కు గాని, ఇటు బాధితులకు గానీ వెల్లడించలేదు.

ప్రాణాలుకు విలువే లేదా..!
ట్రేడ్‌ బ్రోకర్‌ మోసానికి చాలా మంది ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులతో పాటు నిరుపేదలు కూడా బలైపోయారు. 340 మందికి పైగా బాధిత పెట్టుబడిదారులు ట్రేడ్‌ బ్రోకర్‌పై కేసులు పెట్టారు. చాలామంది కోర్టును ఆశ్రయించారు. అటు అధికార పార్టీ నేతలు, మంత్రుల వద్దకు, ఇటు ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరారు. బాధితులకు న్యాయం చేయాలని పట్టుబడుతూ రాజాంకు చెందిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ ఎమ్మేల్యే కంబాల జోగులు సైతం సంతకవిటి పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. అప్పట్లో  హామీ ఇచ్చిన పోలీసులు అర్ధ సంవత్సరమైనా న్యాయం చేయలేకపోయారు. బాధితుల్లో ఒకరైన సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధి దాసరి కన్నంనాయు డు, మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడ మ్మ అనే మరో మహిళ మృతిచెందారు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టుబడిగా పెట్టి మోసపోయామని మరికొంతమంది మంచం పట్టారు. రూ.80 కోట్లకు పైగా పెట్టుబడులు బ్రోక ర్‌ వద్ద పెట్టినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. సంతకవిటి పోలీస్‌స్టేషన్‌లో రూ.40 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంతజరిగినా ఈ కేసులో కదలిక లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆ డబ్బేమైనట్లు...?
రూ. 80 కోట్లు పెట్టుబడులు లాగేసిన బ్రోకర్‌కు కొంతమంది అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఉన్న బ్రోకర్‌ తమకేదైనా చెబుతారని బాధితులు ఎదురుచూసినా ఫలితం లేని పరిస్థితి . ఇంతవరకూ బ్రోకర్‌ ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పాటు ఆయన బంధువులు కూడా కనిపించడం లేదు. ఎంతో కొంత వస్తుందని ఎదురుచూస్తున్నవారికి సైతం నిరాశే ఎదురవుతోందిది. సీఐడీ పోలీసులైనా తమకు న్యాయం చేస్తార ఎదురుచూసినవారికి ఇంతవరకూ ఎటువంటి సానుకూలత లభించలేదు. బ్రోకర్‌ రాజాం వస్తాడని, అక్కడ కలిసి తమ గోడు వెల్లగక్కి ఎంతో కొంత తిరిగి ఇస్తాడేమోనని ఎదురుచూస్తున్నవారికి సైతం శ్రీరామ్‌ కనిపించడం లేదు. ఇంతకీ ఈ డబ్బులు ఉన్నాయా...లేక ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టాడా అన్నది పోలీసులు చేధించి బాధితుల ముందు ఉంచాల్సి ఉంది.  

అంతా సీఐడీ చేతిలోనే..
మా పరిధిలో ఉన్నసమయంలో బ్రోకర్‌ కేసుకు సంబంధించి మా వంతు న్యాయం మేం చేశాం. తర్వాత సీఐడీ పోలీసుల చేతిలో కేసు ఉంది. వారు కూడా ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆరాతీస్తున్నారు. అసలైన నిందితుల వేటలో ఉన్నారు. డబ్బుపై పక్కాగా ఆరా తీస్తున్నారు. త్వరలో వివరాలు వెల్లడించవచ్చు.    – ఎం.వీరకుమార్, రాజాం రూరల్‌ సీఐ, రాజాం.

మరిన్ని వార్తలు